రూ. 699కి 10 సినిమాలు.. ప్లాన్ వర్కవుట్ అవుద్దా!

మరింతమంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం ఎలా? ఈ అంశంపై చాన్నాళ్లుగా కసరత్తులు చేస్తున్నాయి మల్టీప్లెక్స్ సంస్థలు. ఎట్టకేలకు ఓ ఆఫర్ తో ముందుకొచ్చింది పీవీఆర్ ఐనాక్స్ సంస్థ. దేశవ్యాప్తంగా భారీ నెట్ వర్క్ ఉన్న…

మరింతమంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం ఎలా? ఈ అంశంపై చాన్నాళ్లుగా కసరత్తులు చేస్తున్నాయి మల్టీప్లెక్స్ సంస్థలు. ఎట్టకేలకు ఓ ఆఫర్ తో ముందుకొచ్చింది పీవీఆర్ ఐనాక్స్ సంస్థ. దేశవ్యాప్తంగా భారీ నెట్ వర్క్ ఉన్న ఈ సంస్థ.. 699 రూపాయల ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ మొత్తాన్ని చెల్లించి తమ చైన్ లోని థియేటర్లలో 10 సినిమాలు చూసే వెసులుబాటును కల్పిస్తోంది.

ఇంకా చెప్పాలంటే.. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నట్టే ఇది కూడా. ఓటీటీలో ఎలాగైతే నెలవారీ లేదా సంవత్సర చందాలు తీసుకుంటున్నామో.. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడ్డానికి కూడా ఇది సబ్-స్క్రిప్షన్ ప్లాన్ అన్నమాట. 699 రూపాయలకు 10 సినిమాలంటే చెప్పుకోడానికి బాగానే ఉంది కానీ లోపలకు వెళ్లేకొద్దీ ఇందులో చాలా లొసుగులు కనిపిస్తున్నాయి.

వీటిలో అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. ఈ 699 ప్లాన్ కేవలం నెల రోజులకు మాత్రమే. అంటే 30 రోజుల్లోనే దీన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. అసలు నెల రోజుల్లో అన్నిసార్లు థియేటర్లకు వెళ్లి చూసేంత మంచి సినిమాలు ఏమొస్తున్నాయి? ఇది ప్రధాన సమస్య.

వారానికి అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్నీ చిన్న సినిమాలు, పైగా ఫ్లాప్ సినిమాలు. కాస్త బజ్ ఉన్న సినిమాలు ఎప్పుడో 3 నెలలకు ఓసారి మాత్రమే థియేటర్లలోకి వస్తుంటాయి. అలాంటప్పుడు ఈ ప్లాన్ తో ఉపయోగం ఏంటి? 699 రూపాయల సబ్ స్క్రిప్షన్ తీసుకొని, కక్కుర్తిపడి చెత్త సినిమాలు చూసి తలనొప్పి తెచ్చుకోవడం అవసరమా?

పోనీ సినీ ప్రేమికులు ఏదో ఒకటి చూస్తారులే అనుకుందాం. ఇక్కడే రెండో సమస్య ఎదురవుతుంది. ఈ సబ్ స్క్రిప్షన్ కింద సదరు మల్టీప్లెక్సుల్లో కేవలం సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. వీకెండ్స్ లో ఈ సబ్ స్క్రిప్షన్ పనిచేయదన్నమాట. ఉద్యోగస్తులు ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవాలంటే, కంపెనీకి శెలవు పెట్టాలి. లేదంటే సెకెండ్ షోకు వెళ్లాలి. మరుసటి రోజు పొద్దున్నే లేచి మళ్లీ ఆఫీస్ కు వెళ్లాలి.

పోనీ.. సినీ ప్రేమికుడు కాబట్టి నిద్ర త్యాగం చేసి ఏదోలా కిందామీద పడతాడని అనుకుందాం. మరి స్నాక్స్ పరిస్థితేంటి? మల్టీప్లెక్సుల్లో ఇంటర్వెల్ టైమ్ కు బయటకు రావాలంటే గుండె గుభేల్ మంటుంది. ధైర్యం చేసి బయటకొస్తే జేబుకు పెద్ద చిల్లు పడుతుంది. కొన్ని మల్టీప్లెక్సుల్లో మంచినీళ్ల బాటిల్ కూడా కొనుక్కోలేం. అయితే తమ నెట్ వర్క్ లో సోమవారం-గురువారం మధ్య స్నాక్స్ రేట్స్ కూడా తగ్గించామని చెబుతోంది పీవీఆర్-ఐనాక్స్. ఆ తగ్గింపు ఎలా ఉంటుందో క్షేత్రస్థాయిలో దిగితే కానీ బోధపడదు.

దీనికితోడు మరికొన్ని పరిమితులు కూడా విధించింది సదరు సంస్థ. ఈ పాస్ తో ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో సినిమాలు చూడడం కుదరదు. అంతేకాదు.. పీవీఆర్-ఐనాక్స్ ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన గోల్డ్, లూక్స్, డైరక్టర్ కట్స్ సెక్షన్స్ లో ప్రసారం చేసే సినిమాల్ని కూడా చూడడం కుదరదు.

ఇన్ని కండిషన్స్ ఉన్నప్పటికీ ప్రధాన సమస్య మాత్రం ఒకటే. నెల రోజుల్లో 699 రూపాయలకు 10 సినిమాలు చూసే ఓపిక ఉన్నప్పటికీ.. అలా చూడదగ్గ 10 సినిమాలు మార్కెట్లోకి వస్తున్నాయా అంటే కళ్లు తేలేయాల్సిందే. అదే ఓటీటీలోనైతే ఇంతే మొత్తానికి సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా చూసే వెసులుబాటు ఉంది. సోమవారం నుంచి అమల్లోకి రాబోతోంది ఈ ప్రయోగం.