లెజెండరీ క్రికెటర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్ '800'. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. ముత్తయ్య పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, ఆయన భార్య మదిమలర్ పాత్రలో హీరోయిన్ మహిమా నంబియార్ నటించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆయన విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో శివలెంక కృష్ణ ప్రసాద్ ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…
ఎస్పీ చరణ్ తమిళంలో 'వర్షం' రీమేక్ చేసినప్పుడు… ఆ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా తీసుకున్నా. మా నిర్మాణ సంస్థలోనే దర్శకుడిగా పరిచయం చేయాలని అనుకున్నాం. అయితే ముత్తయ్య మురళీధర్ బయోపిక్ చేసే అవకాశం వచ్చిందని చెబితే సంతోషంగా ఆ సినిమా చేసి రమ్మని నేనే చెప్పా. ఆగస్టు తొలి వారంలో అనుకుంటా… శ్రీపతి నుంచి ఫోన్ వచ్చింది. 'సార్… మీరు 800 సినిమాను టేక్ ఓవర్ చేయాలి' అని అడిగాడు. నాకు ఆ సినిమా గురించి తెలుసు. అలా నేను ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యా.
నిజానికి నిర్మాతగా ఈ సినిమాకు ఏమి చేయలేదు. బయోపిక్ కదా… మార్చడానికి ఏం ఉంటుంది? ఉన్నది ఉన్నట్టుగా తీశారు. అలాగని ఇదేదో డాక్యుమెంటరీలా ఉంటుందని అనుకోవద్దు. మురళీధరన్ గారి జీవితంలో కమర్షియల్ హంగులు అన్నీ ఉన్నాయి. ఒక మనిషి జీవితం ఇలా ఉంటుందా? ఎన్ని అవరోధాలు ఎదుర్కొని ఆయన ఈ స్థాయికి చేరుకున్నారా? అని ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా, తెరపై సన్నివేశాలు అలా చూస్తూ ఉండేలా సినిమా ఉంటుంది. శ్రీపతి కూడా ముత్తయ్య మురళీధరన్ గారికి స్క్రిప్ట్ అంతా చూపించి అనుమతి తీసుకుని సినిమా తీశాడు.
ఈ సినిమాను విజయ్ సేతుపతి తో తీయాలని అనుకోవడం, తమిళనాడులో కొంతమంది గొడవ చేయడంతో కాంట్రవర్సీలు వద్దని ఆయన తప్పుకోవడం తెలిసిన విషయాలే. అప్పుడు నానికి కథ చెప్పాలని శ్రీపతి ప్రయత్నించారు. అప్పటికి నాని 'జెర్సీ' చేసి ఏడాదిన్నర మాత్రమే అయింది. అందుకే 'కథ వింటాను కానీ సినిమా చేయలేను' అని నాని ముందే చెప్పారు. కథ విన్నాక 'చాలా బాగుంది' అన్నారు.
800 ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగూలీ వీవీఎస్ లక్ష్మణ్ అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లను కలవడమే ఒక పెద్ద అనుభూతి. ప్రతి ఒక్కరూ చాలా డౌన్ టు ఎర్త్. ఈ జర్నీ మంచి మెమొరబుల్ అని చెప్పాలి. ఇండియాలో సుమారు 1100 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. మేం ఎక్కువగా మల్టీప్లెక్స్ స్క్రీన్ ల మీద దృష్టి పెట్టాం. తర్వాత మెల్లగా థియేటర్లు పెంచుతూ వెళ్తాం.
లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో నైజాం సునీల్ నారంగ్, విశాఖ & ఉత్తరాంధ్ర దిల్ రాజు, ఈస్ట్ గోదావరి గీతా ఫిలింస్, వెస్ట్ గోదావరి ఎల్.వి.ఆర్, కృష్ణాజిల్లా అన్నపూర్ణ స్టూడియోస్, నెల్లూరు అంజలి పిక్చర్స్ భాస్కర్ రెడ్డి, సీడెడ్ ఎస్ సినిమాస్, గుంటూరు పద్మాకర్ సినిమాస్…. ఇలా పేరున్నవారు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు. 'యశోద'ను నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన యుఎఫ్ఓ సంస్థ 800 చిత్రాన్ని కూడా డిస్టిబ్యూట్ చేస్తోంది.
'800' దర్శకుడు శ్రీపతి చేయబోయే తదుపరి సినిమా నేనే నిర్మిస్తున్నా. 'యశోద' దర్శకులతో ఒక సినిమా ఉంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాం. దర్శకుడు పవన్ సాధినేనితో చర్చలు జరుగుతున్నాయి. అతను ఒక మంచి పాయింట్ చెప్పాడు. తెలుగులో 'వదలడు' పేరుతో విడుదలైన సిద్ధార్థ సినిమా దర్శకుడు సాయి శేఖర్ సైతం ఓ కథ చెప్పాడు. నాలుగైదు కథలు రెడీ అవుతున్నాయి. హీరోలకు వినిపించి ఆ తర్వాత సినిమాలు ప్రకటిస్తా.