వరుసపెట్టి సినిమాలు చేస్తోంది నేహాశెట్టి. ఆమె నుంచి మినిమం గ్యాప్స్ లో సినిమాలు వస్తూనే ఉన్నాయి. మొన్నటికిమొన్న బెదురులంక వచ్చింది. ఇప్పుడు రూల్స్ రంజన్ రాబోతోంది. అయితే ఈ ప్రాసెస్ లో ఒకే ఒక్క చోట మాత్రం చాలా ఇబ్బంది పడ్డానని అంటోంది నేహా.
కెరీర్ లోనే తొలిసారి రూల్స్ రంజన్ సినిమా కోసం రెయిన్ సాంగ్ చేసింది నేహా శెట్టి. ఈ పాట తనకు ఛాలెంజ్ విసిరిందని అంటోంది. ఫస్ట్ టైమ్ శారీరకంగా చాలా కష్టపడాల్సి వచ్చిందని అంటోంది.
“సమ్మోహనుడా పాటకి డ్యాన్స్ చేయడం చాలా కష్టం అనిపించింది. చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అది. మీరు పాటను గమనిస్తే, నేను నిప్పులో, నీటిలో, పువ్వుల మధ్య, కొలను పక్కన డాన్స్ చేయాల్సి వచ్చింది. అలాంటి చోట్ల వానలో డాన్స్ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. అయితే మంచి ఔట్ పుట్ రావడం కోసం ఆమాత్రం కష్టపడాలి కదా. మొత్తానికి నా శ్రమకు తగ్గ ఫలితం దక్కింది.”
సమ్మోహనుడా పాటలోని డాన్స్ మాత్రమే కాకుండా, సినిమాలో తన పాత్ర మొత్తం బాగుంటుందని చెబుతోంది నేహా శెట్టి. తిరుపతికి చెందిన అమ్మాయి పాత్రలో నటించానంటోంది. రూల్స్ రంజన్ సినిమా రొటీన్ అమ్మాయి-అబ్బాయి కథ కాదంటోంది.
“రూల్స్ రంజన్ కథ భిన్నంగా ఉంటుంది. అందులో సంఘర్షణ ఉంది. కామెడీ ఉంది. ఇది రొటీన్ అబ్బాయి-అమ్మాయిల కథ కాదు. మంచి లవ్ థీమ్ ఉంటూనే, కథ విభిన్నంగా ఉంటుంది. నటుడిగా కిరణ్ చాలా కూల్. అతను సెట్స్‌లో వినయంగా, కామ్ గా ఉంటాడు. నేను మాత్రం అల్లరి. కెమెరా ముందు కిరణ్ తో ఫ్రీగా ఉండాలని సెట్స్ లో అతడిని సరదాగా మాట్లాడిస్తాను.”
వాన పాటలతో శ్రీదేవి ఎంత పాపులర్ అయిందో, రూల్స్ రంజన్ లోని రెయిన్ సాంగ్ తో తను కూడా అంతే పాపులర్ అవుతానంటోంది నేహా శెట్టి. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది రూల్స్ రంజన్.