షాకిచ్చిన హీరోలు.. ఈ 6 నెలల్లో ఒక్క హిట్ లేదు

6 నెలలు గడిచిపోయాయి. ఎంతో ఆశతో థియేటర్లలోకి వచ్చిన కొంతమంది హీరోల ఆశలు గల్లంతయ్యాయి. క్రేజ్ నిలుపుకోవాలనే తాపత్రయం ఒకరిదైతే, కనీసం హిట్ కొట్టాలనే కసి మరొకరిది, ఎలాగైనా నిలదొక్కుకోవాలనే ఆరాటం ఇంకొకరిది. ఇలా…

6 నెలలు గడిచిపోయాయి. ఎంతో ఆశతో థియేటర్లలోకి వచ్చిన కొంతమంది హీరోల ఆశలు గల్లంతయ్యాయి. క్రేజ్ నిలుపుకోవాలనే తాపత్రయం ఒకరిదైతే, కనీసం హిట్ కొట్టాలనే కసి మరొకరిది, ఎలాగైనా నిలదొక్కుకోవాలనే ఆరాటం ఇంకొకరిది. ఇలా ఎన్నో ఆశలు, ఆశయాలతో వచ్చిన కొంతమంది హీరోలు.. ఈ 6 నెలల్లో అనుకున్నది సాధించలేకపోయారు, ఫ్లాపులు చవిచూశారు.

లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రభాస్ పేరే. ఈమధ్య కాలంలో ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా ఇవ్వలేకపోయాడు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్ సినిమాలతో ఫ్లాప్స్ ఇచ్చిన ఈ హీరో.. ఈ ఏడాది ఆదిపురుష్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలనుకున్నాడు. కానీ ఆ సినిమాతో కూడా నిరాశపరిచాడు. వివాదాలు-విమర్శలు బోనస్.

నాగచైతన్యది కూడా ఇదే పరిస్థితి. కస్టడీ సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ  సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పటికే థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలతో విమర్శలు ఎదుర్కొన్న చైతూ, ఈ ఏడాది కస్టడీ సినిమాతో పరువు దక్కించుకోవాలని చూశాడు. కానీ అతడికి ఆ అవకాశం దక్కలేదు. అటు తమిళ్ లో కూడా నిరాశ తప్పలేదు.

ఈ ఏడాది అక్కినేని బ్రదర్స్ కు అస్సలు కలిసొచ్చినట్టు లేదు. నాగచైతన్యకు కస్టడీ చేదు అనుభవం మిగల్చగా.. అఖిల్ కు ఏజెంట్ మరో డిజాస్టర్ గా మిగిలింది. భారీ బడ్జెట్ తో పాటు, భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాదిని అఖిల్-నాగచైతన్య ఫ్లాప్స్ తో ముగించినట్టే. ఎందుకంటే, వీళ్ల నుంచి మిగిలిన ఈ 6 నెలల్లో మరో సినిమా వచ్చే అవకాశం లేదు.

ఈ ఏడాది తొలి అర్థభాగంలో ఫ్లాప్ ఇచ్చిన హీరోల్లో రవితేజ కూడా ఉన్నాడు. ఇతడు నటించిన రావణాసుర సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. వాల్తేరు వీరయ్యతో సక్సెస్ అందుకున్న రవితేజ, ఆ ఊపును రావణాసురతో కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ ఏడాదిని హిట్ తో స్టార్ట్ చేసిన ఈ హీరో, 6 నెలలు తిరిగేలోపే అట్టర్ ఫ్లాప్ కూడా ఇచ్చాడు.

తొలి 6 నెలల్లో తగిలిన బిగ్గెస్ట్ షాకుల్లో శాకుంతలం కూడా ఒకటి. సమంత లాంటి స్టార్ హీరోయిన్, దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్, గుణశేఖర్ లాంటి సీనియర్ దర్శకుడు కలిసి శాకుంతలం రూపంలో సూపర్ ఫ్లాప్ ఇచ్చారు. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, ఏ దశలోనూ, ఏ సెక్షన్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోవడం బాధాకరం.

ఈ ఏడాది ఫస్టాఫ్ లో ఫ్లాప్స్ ఇచ్చిన హీరోల్లో గోపీచంద్, కల్యాణ్ రామ్ కూడా ఉన్నారు. వరుసగా ఫ్లాపులిచ్చిన గోపీచంద్, రిలీజ్ కు ముందు రామబాణం సినిమాతో ఓ మోస్తరుగా ఆశలు చిగురింపజేశాడు. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ మూవీ. అటు కల్యాణ్ రామ్ కూడా అమిగోస్ తో ఫ్లాప్ ఇచ్చాడు. బింబిసారతో చిరస్మరణీయ విజయాన్నందుకున్న ఈ నందమూరి హీరో, ఆ  ఉత్సాహాన్ని అమిగోస్ తో కొనసాగించలేకపోయాడు.

ఇలా చెప్పుకుంటూపోతే ఈ ఏడాది తొలి 6 నెలల్లో ఫ్లాప్ ఇచ్చిన హీరోల్లో సుధీర్ బాబు (హంట్), నాగశౌర్య (ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి), సందీప్ కిషన్ (మైఖేల్) కూడా ఉన్నారు.