బ్యాడ్ లక్.. ఈ దర్శకుడికి 9 ఏళ్లు గ్యాప్

సినిమాల్లేక ఖాళీ అయిన దర్శకులున్నారు. ఫ్లాపులిచ్చి పక్కకెళ్లిపోయిన డైరక్టర్లు కూడా ఉన్నారు. అవకాశాల్లేక వెనకబడిన దర్శకులు కూడా ఉన్నారు. కానీ అన్నీ ఉండి కెరీర్ లో గ్యాప్ వస్తే ఏమనాలి. బహుశా అలాంటి వ్యక్తిని…

సినిమాల్లేక ఖాళీ అయిన దర్శకులున్నారు. ఫ్లాపులిచ్చి పక్కకెళ్లిపోయిన డైరక్టర్లు కూడా ఉన్నారు. అవకాశాల్లేక వెనకబడిన దర్శకులు కూడా ఉన్నారు. కానీ అన్నీ ఉండి కెరీర్ లో గ్యాప్ వస్తే ఏమనాలి. బహుశా అలాంటి వ్యక్తిని నీలకంఠ అనాలేమో. బ్యాడ్ లక్.. ఈ దర్శకుడి కెరీర్ లో కళ్లముందే 9 ఏళ్ల గ్యాప్ వచ్చేసింది.

నేషనల్ అవార్డ్ అందుకున్న దర్శకుడాయన. ఆయనలో విషయం ఉందని ఎవరైనా అంగీకరిస్తారు. అలాంటి దర్శకుడు, ఏ ప్రాజెక్టు చేపడితే అది ఆగిపోయింది. అలా ఒకటి కాదు, రెండు కాదు.. ఈ 9 ఏళ్లలో 5 సినిమాలు ఆగిపోయాయి. ఇంతకంటే బ్యాడ్ లక్ ఇంకేముంటుంది.

“నిజానికి 2 సినిమాలు స్టార్ట్ అవ్వాలి, చాలా వర్క్ చేశాను, కానీ అవి ప్రారంభంకాలేదు. మాయ మూవీ తర్వాత మహేష్ భట్ నుంచి ఆఫర్ వచ్చింది. ఈ సినిమాను హిందీలో చేయాలని ఆయన అన్నారు. సైన్ కూడా చేశాను, ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ఆ తర్వాత 2 సినిమాలు ఆల్ మోస్ట్ షూటింగ్ స్టేజ్ కు వచ్చి అనుకోని కారణాల వల్ల ఆగిపోయాయి. ఆ తర్వాత మలయాళం సినిమా చేశాను. అలా టాలీవుడ్ లో 9 ఏళ్లు గ్యాప్ వచ్చేసింది.”

ఇలా తన బాధను నవ్వుకుంటూ మీడియాతో పంచుకున్నారు నీలకంఠ. ఈయన దర్శకత్వంలో రావాల్సిన క్వీన్ అనే సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆ టైమ్ లో తమన్న-నీలకంఠ గొడవ పడ్డారనే ప్రచారం జరిగింది. చాలామందికి ఈ ఒక్క సినిమా గురించి మాత్రమే తెలుసని, కానీ తన కెరీర్ లో ఇలాంటి సినిమాలు చాలానే ఆగిపోయాయంటూ లిస్ట్ చెప్పుకొచ్చారు నీలకంఠ.

ఈ సినిమాలతో పాటు.. వెంకటేష్ తో చేయాల్సిన వివేకానంద సిరీస్ కూడా ఆగిన విషయాన్ని బయటపెట్టారు. వెంకటేష్ తో వివేకానంద సిరీస్ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నానని, కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదంటూ బాధపడ్డారు.

ఎట్టకేలకు 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సర్కిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు ఈ దర్శకుడు. విభిన్న సినిమాలు తీయడం తనకు ఇష్టమని, ప్రస్తుతం ఆడియన్స్ కూడా విభిన్న చిత్రాలు కోరుకుంటున్నారని, కాబట్టి సర్కిల్ మూవీ సక్సెస్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు నీలకంఠ.