తెలంగాణ స్ట్రాటజీ ఆంధ్రకు?

అన్నింటికీ ఒకటే మంత్రం పని చేయదు. దేని వ్యవహారం దానికి. కానీ భాజపా మాత్రం తెలంగాణ.. ఆంధ్ర రాజకీయాలను ఒకే మాదిరిగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వైపు రెడ్డి సామాజిక వర్గ ఓట్లు…

అన్నింటికీ ఒకటే మంత్రం పని చేయదు. దేని వ్యవహారం దానికి. కానీ భాజపా మాత్రం తెలంగాణ.. ఆంధ్ర రాజకీయాలను ఒకే మాదిరిగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వైపు రెడ్డి సామాజిక వర్గ ఓట్లు పోలరైజ్ అవుతున్నట్లు కనిపిస్తోంది కనుక, భాజపా పగ్గాలు కూడా అదే సామాజిక వర్గం చేతిలో పెట్టారు తెలంగాణలో. అంత వరకు బాగానే వుంది. ఎందుకంటే తెలంగాణ భాజపా అంటే ఒకప్పుడు రెడ్డి సామాజిక వర్గ డామినేషన్ వుండేది. కానీ గత కొంతకాలంగా ఇది మారింది. ఇలాంటి టైమ్ లో తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటోంది. ఇది ఇటు భాజపాకే కాదు, అటు తెరాస కు కూడా ఇబ్బందికర పరిణామమే.

ఇలాంటి నేపథ్యంలో భాజపా ఒక్కసారిగా పెద్ద మార్పు చేసింది. భాజపా పగ్గాలు కిషన్ రెడ్డికి అందించింది. అసలే భాజపా ను స్పీడ్ తగ్గింది.. తెర వెనుక భాజపా.. భారాస ఒకటే అనే భావన ఇప్పటికే వుంది. ఇటీవలే రాహుల్ గాంధీ కూడా ఇలాంటి ఆరోపణలే చేసి వెళ్లారు. ఇలాంటి టైమ్ లో బిసి ల నుంచి పగ్గాలు తీసుకుని రెడ్లకు అందంచడం అంటే కాంగ్రెస్ ను కట్టడి చేయడం కోసమే అనే అభిప్రాయం కచ్చితంగా వినిపిస్తుంది. కానీ ఇప్పటికే రెడ్లు కాంగ్రెస్ వైపు పోలరైజ్ కావడం మొదలైపోయింది. కిషన్ రెడ్డి అయినా ఇప్పుడు పెద్దగా చేసేది ఉండకపోవచ్చు.

ఇదిలా వుంటే దాదాపు ఇలాంటి స్ట్రాటజీనే ఆంధ్రలో కూడా అమలు చేస్తోంది. ఆంధ్రలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు నూటికి తొంభై తొమ్మిది శాతం తెలుగుదేశం పార్టీకే పడతాయి. అందులో అణుమాత్రం సందేహం లేదు. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు తొంభై శాతం వైకాపాకు పడతాయి. అందులోనూ డౌట్ లేదు. జనసేన పూర్తిగా కాపుల పార్టీగా ముద్ర పడిపోయింది. ఇక మిగిలింది భాజపా. ఇప్పటి వరకు దీనికి ఓ కలర్ లేదు.. డిజైనూ లేదు.

వెంకయ్య నాయుడు వున్నంత కాలం కమ్మవారికి ప్రాధాన్యత వుంటూ వచ్చింది. తేదేపా బి పార్టీగా ముద్ర పడింది. కామినేని శ్రీనివాస్, కంభంపాటి హరిబాబు లాంటి వారికే పదవులు వరించాయి. తరువాత కూడా పురంధ్రీశ్వరి, సుజన చౌదరి లాంటి వాళ్లు అందులోకి వెళ్లారు. కానీ ఇలా భాజపాకు ‘కమ్మ’దనం అద్దడం వల్ల తెదేపాకు ఏనాడూ సమస్య కాలేదు. అందువల్ల ఇప్పుడు కొత్తగా పురంధ్రీశ్వరికి పగ్గాలు అప్పగించడం వల్ల తేడా ఏమీ రాదు. పైగా చాలా విషయాల్లో పురంధ్రీశ్వరి అభిప్రాయాలు ఇటీవల తేదేపా అనుకూలంగానే వుంటున్నాయి. ముఖ్యంగా రాజధాని విషయంలో.

సో, ఇప్పుడు పురంధ్రీశ్వరి నియామకం కమ్మ ఓట్లలో చీలిక తెచ్చేస్తుందనే భ్రమ అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. కాపు ఓట్లు మొత్తం జనసేన దిశగా పోలరైజ్ కావడానికి మాత్రం ఇది పనికి వస్తుంది. ఇక బిసి ఓట్లే కీలకం. ఇటు వైకాపా అయినా, తేదేపా అయినా బిసి ఓట్లను ఏ మేరకు తెచ్చుకోగలిగితే వారిదే గెలుపు అవుతుంది. ఇదే భాజపా కనుక బి సి లకు పార్టీ పగ్గాలు అప్పగించి వుంటే గమ్మత్తుగా వుండేది. కమ్మ.. రెడ్డి.. కాపు.. బిసి పార్టీలుగా నాలుగూ పోరు బాటలో నిలిచేవి.

ఈసారి ఎన్నికల్లో భాజపా- తేదేపా – జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రం ఎలా వుంటుందో చూడాలి. అలా కాకపోతే పెద్దగా మార్పు వుండదు పరిస్థితిలో.