జూనియర్ గంటా అరంగేట్రం?

రాజకీయాల్లో వారసులకు కొదవ లేదు. తండ్రులు హిట్ అయితే తనయులు అదే బాట పడతారు. విశాఖ జిల్లాలో పాతికేళ్ళుగా రాజకీయం చేస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన కుమారుడిని కూడా పాలిటిక్స్ వైపుగా…

రాజకీయాల్లో వారసులకు కొదవ లేదు. తండ్రులు హిట్ అయితే తనయులు అదే బాట పడతారు. విశాఖ జిల్లాలో పాతికేళ్ళుగా రాజకీయం చేస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన కుమారుడిని కూడా పాలిటిక్స్ వైపుగా రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇద్దరు మాజీ మంత్రులు సీనియర్ నేతల వారసుడుగా గంటా రవితేజాని  చెబుతారు. మాజీ మంత్రి నారాయణ కుమార్తెనే రవితేజా చేసుకున్నారు. దాంతో రవితేజా 2024లో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చూస్తున్నారా అన్న డౌట్లు తమ్ముళ్లకు వస్తున్నాయి. గంటా రవితేజా తాజాగా నెల్లూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ ని కలసి ముచ్చటించారు.

యువతకు తెలుగుదేశం పార్టీతోనే భవిష్యత్తు అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు యువతకు తెలుగుదేశం ఇస్తుందని రవితేజా ప్రకటించారు. అందులో ఆయన సీటు కూడా ఉందా అని అంటున్నారు. విశాఖ జిల్లాలోని అనకాపల్లి నుంచి కానీ చోడవరం నుంచి కానీ గంటా రవితేజా పోటీ చేస్తారు అని ప్రచారం సాగుతోంది.

ఈ రెండు సీట్లూ గతంలో గంటా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచినవే. వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లాలో గంటా టీడీపీకి తన వంతుగా పెద్ద ఎత్తున సేవలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అంగబలం అర్ధబలం నిండుగా ఉన్న గంటా తనకూ తన కుమారుడికీ రెండు సీట్లు తీసుకుంటారా అన్నదే చూడాలి. 

గతంలో టీడీపీ తరఫున తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్న గంటా ఈసారి కొడుకు కోసం టికెట్ తెప్పించుకోగలరు అనే  అంటున్నారు. పైగా నారాయణ అల్లుడి హోదాలో కూడా రవితేజాకు టికెట్ పొందే అర్హత ఉంది అంటున్నారు. అకస్మాత్తుగా నెల్లూరులో నారా లోకేష్ తో రవితేజా భేటీ కావడంతో జూనియర్ గంటా రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం అయిందనే అంటున్నారు.