అందరికీ చెరొకటి.. ప్రభాస్ కు మాత్రం మూడు

ఇదేదో రికార్డుల లెక్క అనుకోవద్దు. ఇది చలాన్ల లెక్క. ఈమధ్య హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు కార్లపై గట్టి నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉన్న కార్లను ఆపి, అక్కడికక్కడే…

ఇదేదో రికార్డుల లెక్క అనుకోవద్దు. ఇది చలాన్ల లెక్క. ఈమధ్య హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు కార్లపై గట్టి నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉన్న కార్లను ఆపి, అక్కడికక్కడే చలాన్లు వేస్తున్నారు. అక్కడితో ఆగకుండా స్పాట్ లో బ్లాక్ ఫిలిం తొలిగించి మరీ సదరు సెలబ్రిటీని ఇంటికి పంపిస్తున్నారు. ఇప్పుడీ విషయంలో ఒకేసారి 3 చలాన్లతో ప్రభాస్ రికార్డ్ సృష్టించాడు.

జూబ్లిహిల్స్ రోడ్ నంబర్-36లో ప్రభాస్ కారును ఆపారు ట్రాఫిక్ పోలీసులు. ఆ కారుకు ఏకంగా 3 చలాన్లు విధించారు. అందరు సెలబ్రిటీల కార్లలానే ప్రభాస్ కారుకూడా బ్లాక్ ఫిలిం ఉంది. దాంతో పాటు.. కారు నంబర్ ప్లేటు సరిగ్గా లేదు. పైగా కారుపై ఎంపీ స్టిక్కర్ అతికించి ఉంది. ఈ 3 విషయాల్లో 3 చలాన్లు రాశారు పోలీసులు.

బ్లాక్ ఫిలిం విషయంలో హైదరాబాద్ పోలీసులు తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని అమలు చేసి తీరతామంటున్నారు. ఇందులో భాగంగా త్రివిక్రమ్, నాగచైతన్య, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్, మంచు మనోజ్, ఎన్టీఆర్ కార్లను ఆపి బ్లాక్ ఫిలిం తొలిగించారు. ఫైన్లు కూడా వేశారు.

ఇప్పుడీ లిస్ట్ లోకి ప్రభాస్ కూడా చేరాడు. అందరి కార్లకు ఒక చలాన్ పడితే.. ప్రభాస్ కారుకు మాత్రం ఒకేసారి 3 చలాన్లు పడ్డాయి. వీటి మొత్తం ఖరీదు 1600 రూపాయలు. అన్నట్టు నిన్నటితో డిస్కౌంట్ పై చలాన్లు క్లియర్ చేసే ఆఫర్ తెలంగాణలో ముగిసింది. పాపం ప్రభాస్, 50శాతం డిస్కౌంట్ తో చలాన్లను క్లియర్ చేసుకునే అవకాశాన్ని కొన్ని గంటల తేడాలో మిస్ చేసుకున్నాడు.