60 సీట్ల మణిపూర్‌లో బిజెపి సొంతంగా 32 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బిజెపికి 2017లో 21 (35%) సీట్లున్నాయి కానీ ఎన్నికలకు ముందు 52 స్థానాలున్న అసెంబ్లీలో 31 స్థానాలు (60%) ఉన్నాయి. ఇప్పుడు 60లో 32 (53%) మాత్రమే వచ్చాయి. బిరేన్ సింగ్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కింగ్ మేకర్ అవుదామన్న ఆశతో ఎన్నికలకు ముందు బిజెపితో పొత్తు చెడగొట్టుకున్న ఎన్‌పిపి, ఎన్‌పిఎఫ్ దిగాలు పడ్డాయి. ఎన్నికలయ్యాక 4 సీట్లు వచ్చిన ఎన్‌పిఎఫ్ మళ్లీ బిజెపి చెంత చేరి ఒక మంత్రిపదవి దక్కించుకుంది. ఇటీవలే అది నాగాలాండ్‌లోని ఎన్‌డిఏ ప్రభుత్వంలో చేరింది.
సంగ్మా పార్టీ ఐన ఎన్‌పిపి విషయానికి వస్తే అది మేఘాలయలో బిజెపితో అధికారం పంచుకుంటోంది. ఇక్కడ పేచీ వస్తే మేఘాలయలో వచ్చే ఏడాది రాబోయే ఎన్నికలలో పొత్తు కుదరకపోవచ్చు. ఈలోపునే ఏదోలా రాజీ పడవచ్చు. 2020 జూన్‌లో బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలోంచి బయటకు వచ్చి, కాంగ్రెసును సమర్థిస్తానంటూ కాస్త హడావుడి చేసింది. అదే సమయానికి బిజెపి ఎమ్మెల్యేలు ముగ్గురు కాంగ్రెసు వైపు తిరిగిపోవడంతో, దీని మద్దతు ధీమాతో కాంగ్రెసు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. అంతలోనే ఎన్‌పిపి నాయకులు దిల్లీ వెళ్లి అమిత్ షాను, నడ్డాను కలిశారు. అంతే, కథ మారిపోయింది. ఎన్‌పిపి, జై బిజెపి అంది. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మేఘాలయ ఎన్నికల ముందు కూడా అలాటిదేదో జరగవచ్చు.
2017 కంటె బిజెపికి ఓట్లు 2.7% పెరిగి 37.8% రాగా కాంగ్రెసు ఏకంగా 18.6% పోగొట్టుకుని, 16.8% దగ్గర ఆగిపోయింది. బిజెపికి 11 సీట్లు పెరగగా, కాంగ్రెసుకి 23 తగ్గి, 5 సీట్లు తెచ్చుకుని 4వ స్థానంలో నిలబడింది. కొత్తగా మణిపూర్‌లో అడుగుపెట్టిన జెడియుకి దాని కంటె ఎక్కువగా 6 సీట్లు వచ్చాయి. ఎన్‌పిపికి 3 సీట్లు పెరిగి 7 వచ్చి ద్వితీయస్థానంలో నిలబడింది. 2017లో బిజెపి కంటె 7 సీట్లు ఎక్కువ తెచ్చుకున్న కాంగ్రెసుకి యిప్పుడీ గతి పట్టిందంటే, అది ఎంతలా బలహీనపడిందో అర్థమవుతుంది. మణిపూర్‌లో లోయ ప్రాంతం, పర్వతప్రాంతం వేర్వేరుగా వుంటాయని గత వ్యాసంలోనే రాశాను. మీతేయీలు మెజారిటీలో ఉన్న లోయలోని 40 స్థానాల్లో బిజెపికి గతంలో 16 వస్తే యీసారి 26 వచ్చాయి. కాంగ్రెసుకి వచ్చిన అయిదూ యిక్కడే వచ్చాయి.
నాగాలు, కుకీలు మెజారిటీలో ఉన్న పర్వత ప్రాంతంలో పాగా వేయడానికి బిజెపి ఎంత ప్రయత్నించినా అక్కడున్న 20 సీట్లలో 5 నుంచి 6కి మాత్రమే పెంచుకోగలిగింది. కాంగ్రెసు పరిస్థితి మరీ ఘోరం. ఒక్కటీ రాలేదు. ప్రాంతీయ పార్టీలదే అక్కడ హవా. నాగాలకు కాంగ్రెసుపై కోపం ఉందని చెప్తూ దానికి కారణాలు గతవ్యాసంలో రాశాను. అది ఎన్నికలలో ప్రతిఫలించింది. తన ఓటమి కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెసు ఏవేవో ఆరోపణలు చేసింది కానీ జనాలు అవి పట్టించుకోలేదు. బిజెపి ప్రభుత్వం సాధించిన విజయాల్లో మొదటగా చెప్పవలసినది టెర్రిజం సంబంధిత సంఘటనల సంఖ్య బాగా తగ్గిపోవడం. గతంలో రాజధాని ఇంఫాల్‌తో సహా అనేక ఊళ్లలో చీకటి పడిందంటే బయటకు రావడం భయంగా ఉండేది. గత ఐదేళ్లలో శాంతిభద్రతలు బాగా పెరిగి, ప్రజలు ధైర్యంగా తిరగాడసాగారు.
జాతుల మధ్య వైరం అనేది కూడా మణిపూరును చాలాకాలంగా వేధిస్తున్న సమస్య. రాష్ట్ర జనాభా 2011 ప్రకారం 28 లక్షలు. వారిలో 57% మంది అంటే 16 లక్షలమంది మీతేయీలే. వాళ్లు రాష్ట్రం మొత్తం ఏరియాలో 11% ఏరియాలో కిక్కిరిసి ఉంటారు. దాన్ని ఇంఫాల్ లోయ అంటారు. పర్వతప్రాంతాలలో కొన్ని చోట్ల నాగాలు, మరి కొన్ని చోట్ల కుకీలు అధికసంఖ్యలో ఉన్నారు. వీళ్లందరి మధ్య ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఇతర ప్రాంతం నుంచి తమ ప్రాంతానికి రాకుండా దిగ్బంధాలు (బ్లాకేడ్) చేస్తూంటారు. 2017 ఎన్నికలకు ముందు ఏడు కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ యునైటెడ్ నాగా కౌన్సిల్ వారు నాలుగు నెలలపాటు ఆర్థిక దిగ్బంధం నిర్వహించారు. అయితే బిజెపి ప్రభుత్వం వచ్చాక ఒక్క దిగ్బంధం కూడా జరగలేదు.
నాగాలు అధిక సంఖ్యలో ఉండే ఉఖ్రుల్ జిల్లాకు వెళ్లినపుడు బిరేన్ సింగ్‌కు అద్భుత స్వాగతం లభించింది. గతంలో కాంగ్రెసు ముఖ్యమంత్రి వస్తే నిరసనలే ఉండేవి. ఎన్‌పిఎఫ్‌తో పొత్తు పెట్టుకోవడం బిజెపికి లాభించింది. ఫైనల్‌గా మీతేయీలు అధికసంఖ్యలో ఉన్న ఇంఫాల్ లోయ జిరిబమ్‌లోని 41 సీట్లలో 26 బిజెపికి, 5 కాంగ్రెసుకు, 5 ఎన్‌పిపికి, 5 ఇతరులకు వచ్చాయి. నాగాలు అధికసంఖ్యలో ఉన్న పర్వతప్రాంతంలోని 12 సీట్లలో 2 బిజెపికి, 5 ఎన్‌పిఎఫ్‌కి, 2 ఎన్‌పిపికి, 3 ఇతరులకు వచ్చాయి. కుకీలు అధికంగా ఉన్న పర్వతప్రాంతంలోని 7 సీట్లలో 4 బిజెపికి, 3 ఇతరులకు వచ్చాయి.
ఇండియా టుడే-ఏక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం జనాభాలో 41% ఉన్న హిందువుల్లో 52% బిజెపికి, 12% కాంగ్రెసుకు, 19% ఎన్‌పిపికి, 17% యితరులకు వచ్చాయి. జనాభాలో 41% ఉన్న క్రైస్తవుల్లో 33% బిజెపికి, 20% కాంగ్రెసుకు, 8% ఎన్‌పిపికి, 20% ఎన్‌పిఎఫ్‌కు, 19% యితరులకు వచ్చాయి. జనాభాలో 8% ఉన్న ముస్లిముల్లో 9% బిజెపికి, 40% కాంగ్రెసుకు, 34% ఎన్‌పిపికి, 11% యితరులకు వచ్చాయి. జనాభాలో 8% ఉన్న ఇతరులలో (సనామాహీలు) 47% బిజెపికి, 18% కాంగ్రెసుకు, 19 % ఎన్‌పిపికి, 16 % యితరులకు వచ్చాయి.
గత ఐదేళ్లలో 28 కాంగ్రెసు ఎమ్మెల్యేలలో 15మందిని బిజెపి గుంజుకుంది. అయినా కాంగ్రెసు ఏమీ చేయలేకపోయింది. ఇబోబి సింగ్‌పై వ్యతిరేకత పెరుగుతున్నా అధిష్టానం పట్టించుకోలేదు. 5ఏళ్లలో ముగ్గురు ఎఐసిసి ఇన్‌చార్జిలను మార్చింది, ముగ్గురు ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులను మార్చింది. అయినా పరిస్థితి మెరుగుపడలేదు. సంస్థాగతంగా బలపడలేదు. మరో పక్క బిజెపి సంస్థాగతంగా నానాటికీ పటిష్టమౌతూ వచ్చింది. పార్టీ జాతీయ నాయకులను రాష్ట్రానికి పంపుతూ వచ్చింది. ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెసు నుంచి దిగుమతి చేసుకున్నవారిలో 12 మందికి టిక్కెట్లిచ్చింది. కొన్ని రంగాలలో ప్రభుత్వం అనుకున్నట్లుగా చేయలేదని, ముఖ్యంగా కరోనా విషయంలో విఫలమైందని, అయినా సంక్షేమపథకాలు, ఇన్సూరెన్సు స్కీము వంటి వాటితో ఓటర్లు ప్రభావితమౌతున్నారని గత వ్యాసంలోనే రాశాను. ఎదిరించే శక్తి ఉన్న కాంగ్రెసు చప్పబడడంతో బిజెపితో పాటు తక్కిన పార్టీలు కూడా లాభపడి, తమ సంఖ్యాబలాన్ని పెంచుకోగలిగాయి. (ఫోటో బిరేన్ సింగ్ ప్రమాణస్వీకారం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)