నిండు కుండ లాంటి ఉమ్మడి ఏపీ రెండు ముక్కలు అయింది. అడ్డగోలుగా ఏపీని విభజించారు అన్నది అందరికీ తెలిసిందే. దీని మీద న్యాయ పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన విషయాలే వెల్లడించారు. ఏపీ విభజన చేసే సమయానికి పార్లమెంట్ లో యూపీయేకు అవసరం అయిన మెజారిటీ లేనే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందుకే తలుపులు మూసి, టీవీ ప్రసారాలు ఆపు చేసి మరీ విభజన అయిందనిపించేశారు అని ఆరోపించారు. దీని మీద తాను ఎనిమిదేళ్ళుగా న్యాయ పోరాటం చేస్తూంటే ఇపుడు దానికి కొంత ఆశ కనిపిస్తోందని అన్నారు. తాను సుప్రీం కోర్టులో వేసిన కేసును వాదించడానికి ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ అంగీకరించారని, దాంతో ఈ కేసు ముందుకు కదులుతోందని అన్నారు.
ఇక తాను దాఖలు చేసిన పిటిషన్ ని తాజాగా సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించిందని ఉండవల్లి చెప్పారు. లిస్టింగ్ లో విభజన కేసు ఉండవచ్చునని, దీని మీద వాదనలు జరిగి తాను కోరుకున్నట్లుగా తీర్పు వస్తుందన్న ఆశతో ఉన్నట్లుగా ఉండవల్లి చెప్పారు. అడ్డగోలు విభజన తప్పు అని కోర్టు తీర్పు వస్తుందన్న ఆశతోనే ఉన్నానని ఆయన చెప్పడం విశేషం.
అయితే తీర్పు వచ్చినా విభజన జరిగిపోయింది కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఇప్పటిదాకా జరిగినది, ఏపీకి అన్యాయం అయినది ఒక ఎత్తు అయితే ఇక మీదట కేంద్రంలోని ప్రభుత్వాలు ఇలాంటి అడ్డగోలు చర్యలకు పాల్పడకుండా కోర్టు తీర్పు ఉండే అవకాశం ఉందని ఉండవల్లి అంటున్నారు.
మొత్తానికి విభజన తప్పు అని కోర్టు తీర్పు కనుక వస్తే అది ఏపీకి నైతిక విజయమే. అదే విధంగా కాంగ్రెస్ కు సోనియాకూ కూడా అది నైతిక పరాజయమే అవుతుంది.