ఓ స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు అందరూ చేస్తారు. కానీ ఆ ఆరోపణల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందా లేదా అనే విచక్షణ ఆ వ్యక్తికి ఉండాలి. ప్రతి ఆరోపణకు ప్రత్యారోపణ చేసుకుంటూ వెళ్తే అంతుండదు. పైపెచ్చు ఎదుటివ్యక్తి స్థాయిని కావాలని పెంచినట్టవుతుంది. అదే సమయంలో తన స్థాయిని తానే చేజేతులా తగ్గించుకున్నట్టు అవుతుంది. నిన్నట్నుంచి నడుస్తున్న బండ్ల గణేశ్, ఎంపీ విజయసాయి ఎపిసోడ్ కి ఇది అతికినట్టు సరిపోతుంది.
ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎంపీ విజయసాయిరెడ్డిపై విరుచుకుపడుతున్నాడు బండ్ల గణేశ్. కమ్మజాతిని కించపరిచారు అనే వ్యాఖ్యల నుంచి రాజకీయాల వరకు రకరకాల ట్వీట్స్ తో నిన్నట్నుంచి విజయసాయిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. సడెన్ గా ఆయన ఎందుకు విజయసాయిపై పడ్డారు? ఇది ఆయన వ్యక్తిగత ఎజెండా. ఆయన స్వార్థం ఆయనది. ఆయన స్వలాభం ఆయనది. ఆయన లక్ష్యం వేరు. ఇలాంటి విమర్శలు, ఆరోపణలకు విజయసాయి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ స్థాయిబేధం చూసుకోవాలి.
విజయసాయి ఎవరు.. బండ్ల గణేశ్ ఎవరు.. అనే విషయాన్ని ప్రశ్నించుకుంటే అసలు బండ్ల ట్వీట్స్ కు విజయసాయి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఈజీగా బోధపడుతుంది. కానీ ఆయన స్పందించారు. తన స్థాయిని తానే దిగజార్చుకున్నారు.
ఏపీ రాజకీయాలతో బండ్ల గణేశ్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆయనకు రాజకీయ స్నేహితులు ఉండొచ్చు కానీ రాజకీయాలతో సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఆయన ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా కాదు. ఆయన ఇల్లు తెలంగాణలో ఉంది. వ్యాపారాలు ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నాయి. చివరికి ఆయన ఆధార్ కార్డు, ఓటరు కార్డు కూడా తెలంగాణవే. అలాంటి వ్యక్తి ఆరోపణలు చేస్తే విజయసాయి ఎందుకు స్పందించాలి. రేపు ఉదయం రాజకీయంగా ముక్కుమొహం తెలియని మరో వ్యక్తి విమర్శిస్తే, విజయసాయి ఇలానే స్పందిస్తారా? ఇదిలా ఎంత దూరం పోతుంది?
ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లకే స్థాయి లేదని చాలామంది ఫీల్ అవుతుంటారు. కనీసం ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేకపోయిన వ్యక్తులు వాళ్లు. అలాంటి వాళ్లపైనే ఎంపీ స్థాయిలో ఉన్న విజయసాయి విమర్శలు చేస్తున్నారు, సెటైర్లు వేస్తున్నారు. వాళ్లు ఏపీ పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి ఓకే అనుకోవచ్చు. మరి బండ్ల గణేశ్ కు ఏ స్థాయి ఉంది? కనీసం ఆయనకు ఏపీలో ఓటు హక్కు కూడా లేదాయె! పోనీ, తెలంగాణ రాజకీయాల్లో ఆయనేమైనా క్రియాశీలక వ్యక్తా..? ఏదైనా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడా? అలాంటి వ్యక్తిపై విజయసాయి స్పందించి తన స్థాయి తగ్గించుకోవడం ఎందుకు?
నిన్నట్నుంచి విజయసాయి సంయమనంతోనే ఉన్నారు. ఆయన నుంచి బండ్ల గణేశ్ కు కౌంటర్ గా ఎలాంటి ట్వీట్లు రావని అంతా అనుకున్నారు. ఎందుకంటే, బండ్ల స్థాయి వ్యక్తిపై ఎంపీ స్థాయి వ్యక్తి స్పందించాల్సిన అవసరం లేదు. అది అలానే కొనసాగితే బాగుండేది. 2 రోజుల తర్వాత బండ్ల తనంతట తానే సైలెంట్ అయ్యేవారు. అది ఆయన నైజం కూడా. కానీ విజయసాయి స్పందించారు. బండ్లను ఏపీ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా మార్చేశారు. తన స్థాయిని తానే తగ్గించుకున్నారు.
ఈ ట్వీట్ల యుద్ధం చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటోళ్లు నవ్వుకుంటారు తప్పితే, బండ్ల గణేశ్ కు పోయేదేం లేదు. “సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్” ఎపిసోడ్ తోనే ఆయన సిగ్గు వదిలేశాడు. విజయసాయి కూడా బండ్ల స్థాయికి దిగజారాలనుకుంటున్నారా? ఇప్పుడు ఏపీలో ఎల్లో మీడియా బండ్ల గణేశ్ ను భుజానికెత్తుకుంది. ఆ అవకాశం ఇచ్చింది విజయసాయి కాదా?