ఇప్పటికే ఏపీలో టికెట్ రేట్లు తగ్గించారని మూలిగే నక్కలా మారింది టాలీవుడ్. దానిపై ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేషియో అంటూ తాటిపండు వేశారు సీఎం జగన్. రాత్రి కర్ఫ్యూతో పాటు ఏపీలో విడుదలైన కొత్త కొవిడ్ మార్గదర్శకాల్లో సినిమా థియేటర్ల విషయం కూడా ఉంది. సీటు మార్చి సీటు ప్రేక్షకులకు కేటాయించాలని పాత పద్ధతిని తెరపైకి తెచ్చారు.
గతంలో ఇలాంటి నియమం అమలులో ఉండటంతో సినిమాల విడుదలలు వాయిదా వేసుకున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు కూడా పాన్ ఇండియా సినిమాలు ఇతర రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడటంతో ఆగిపోయాయి. కేవలం తెలుగు ప్రేక్షకులనే టార్గెట్ చేసుకున్న సినిమాలు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసి రెడీగా ఉన్నాయి. ఇప్పుడిలాంటి సినిమాలకు కూడా కష్టకాలం మొదలైనట్టే.
50 శాతం ఆక్యుపెన్సీతో సానా కష్టం..
ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేషియో అంటే సగానికి సగం ఆదాయం పడిపోయినట్టే, ఇలాంటి నియమాల వల్ల థియేటర్లతో పాటు, మాల్స్ లోని క్యాంటీన్లు, ఇతరత్రా ఆదాయాలు కూడా తగ్గిపోతాయి. దీంతో సహజంగానే థియేటర్ ఓనర్ కి కానీ, నిర్మాతలకు కానీ ఏమీ మిగలదు. ఒకరకంగా థియేటర్లు మూసేయండి అనడంతో ఇది సమానం. అందుకే నిర్మాతల్లో భయం మొదలైంది.
వాయిదానా, ఓటీటీనా..?
నాకీ టికెట్ రేటు చాలు, ఇప్పుడున్న థియేటర్లు చాలు అంటూ ఇటీవల నాగార్జున బంగార్రాజు విడుదల సమయంలో చెప్పారు. మరి కొత్త నిబంధనల వల్ల నాగార్జున సినిమా తీసి జేబులో పెట్టుకోలేం అనే మాటకే ఫిక్స్ అవుతారా, వాయిదా వేస్తారా అనేది చూడాలి. ఇప్పటికిప్పుడు ఓటీటీలతో బేరాలు పెడితే, ఎగ్జిబిటర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇండస్ట్రీలో ఇప్పటికే గందరగోళం నెలకొంది. అటు తెలంగాణ కూడా ఏపీ బాటలోనే నడిచే అవకాశముంది. కాకపోతే ఒకటీ రెండ్రోజులు తేడా.. అంతే.
మొత్తమ్మీద… సినిమా వాళ్లు బాగా బలిసిపోయారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేసిన రోజే.. ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ విధానంతో వారి ఆశలపై నీళ్లు పడ్డాయి. మరి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. అసలే ఇది కరోనా కాలం.. స్పందించడానికేం లేదు.