కొడుకు దుర్మార్గాలకు తండ్రికి శిక్ష పడుతుందా?

సాధారణంగా నేరం చేసిన వాడికే శిక్ష పడాలి. కానీ ఒక్కోసారి నేరం ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే నేరం చేసిన వాడికి, శిక్ష అనుభవించేవాడికి సంబంధం ఉంటుంది కాబట్టి.…

సాధారణంగా నేరం చేసిన వాడికే శిక్ష పడాలి. కానీ ఒక్కోసారి నేరం ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే నేరం చేసిన వాడికి, శిక్ష అనుభవించేవాడికి సంబంధం ఉంటుంది కాబట్టి. శిక్ష అంటే జైలు శిక్ష కానక్కరలేదు. మరో రకం శిక్ష కూడా కావొచ్చు. తెలంగాణలోని కొత్తగూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు విషయంలో ఇలాగే జరుగుతుండవచ్చని కొందరు అనుకుంటున్నారు.

శిక్ష పడాలని కూడా కొందరు కోరుకుంటున్నారు. అయితే ఈ శిక్ష రాజకీయపరమైంది. ఈ శిక్షతో వనమా వెంకటేశ్వర రావుకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండకూడదని కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం అంటే అధినేత కేసీఆర్ వనమాకు ఇలాంటి శిక్ష విధిస్తే అది మిగతా నాయకులకు గుణపాఠంగా ఉంటుందని అనుకుంటున్నారు. వనమా వెంకటేశ్వర రావు ఈమధ్య వార్తల్లో వ్యక్తి అయ్యాడు.

ఇందుకు కారణం ఆయన కుమారుడు వనమా రాఘవేంద్ర అలియాస్ రాఘవ. ఇతని కారణంగా కొత్తగూడెం సమీపంలోని పాత పాల్వంచకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటన తరువాత వనమా రాఘవ అకృత్యాలను, అరాచకాలను మీడియా బయట పెట్టింది. అతను ఎంత దుర్మార్గుడో జనాలకు తెలిసింది.

ఎట్టకేలకు రాఘవను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు తానే కారణమని  రాఘవ ఒప్పుకున్నాడని పోలీసు అధికారులు చెప్పారు. టీఆర్ఎస్ అధిష్టానం కూడా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీలు రాఘవను ఛీ కొట్టారు. కొడుకు కారణంగా తండ్రి వెంకటేశ్వరరావుకూ చెడ్డ పేరు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన వనమా వెంకటేశ్వరరావు ఓ పార్టీ ఫిరాయింపుదారు.

కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీలో చేరాడు. దుర్మార్గుడైన వనమా రాఘవకు శిక్ష పడుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. తండ్రి ఎమ్మెల్యే కాబట్టి ఏదైనా మాయ చేసి శిక్ష పడకుండా కూడా చేయవచ్చు. కొడుకు విషయం పక్కకు పెడితే తండ్రికి రాజకీయంగా శిక్ష పడాలి. అదెలా అంటే ….వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఆయనకు టిక్కెట్ ఇవ్వకూడదు.

ఒకవేళ కేసీఆర్ విజ్ఞత లేకుండా టిక్కెట్ ఇచ్చినా వనమా గెలిచే అవకాశం ఉండదు. కొడుకు చేసిన పని వల్ల ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. త‌న‌యుడు తెచ్చిన త‌ల‌వంపులు ఇప్పుడు వెంక‌టేశ్వ‌ర్రావు రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు ముగింపు ప‌లికేలా క‌నిపిస్తున్నాయని అంటున్నారు. అదే స‌మ‌యంలో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే   వెంక‌ట్రావుకు మాత్రం లాభం చేకూరే ఆస్కారం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్రావు విష‌యంలో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ పార్టీ అధిష్ఠానం ఓ నిర్ణ‌యం తీసుకోలేదు. ఆయ‌న విష‌యంలో పార్టీ వేచి చూసే ధోర‌ణి అవ‌లంబిస్తుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్ర‌జ‌ల నుంచి తీవ్ర ఒత్తిడి వ‌స్తుండ‌డంతో రాఘ‌వ‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని దాని ప్ర‌భావం వెంక‌టేశ్వ‌ర్రావుపై కూడా ప‌డుతుంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

2014 ఎన్నిక‌ల్లో కొత్త‌గూడెం నుంచి టీఆర్ఎస్ త‌ర‌పున జ‌ల‌గం వెంక‌ట్రావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కారు పార్టీ త‌ర‌పున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వెంక‌ట్రావు మాత్ర‌మే. కానీ 2018 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. కాంగ్రెస్ త‌ర‌పున గెలిచిన మాజీ మంత్రి వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్రావు టీఆర్ఎస్‌లో చేరారు. అప్ప‌టి నుంచి వ‌న‌మా, జ‌ల‌గం వ‌ర్గాల మ‌ధ్య విభేదాలు తీవ్ర‌త‌ర‌మ‌య్యాయి.

వాస్తవానికి వనమా వేంకటేశ్వర రావు ఫిరాయింపుదారు. ఆయన కాంగ్రెస్ తరపున కొత్తగూడెంలో 1989 లో, 1999 లో, 2004 లో ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశాడు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరాడు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావు చేతిలో ఓడిపోయాడు.

మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి జలగం వెంకటరావు పై 4,120 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2018 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యే. మరి ఈయనకు వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ టిక్కెట్ దక్కుతుందా? లేదా? చూడాలి.