కరోనా థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుండడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మళ్లీ కరోనా చేదు అనుభవాలు గుర్తొచ్చేలా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ , తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతుండడం, నిబంధనలు అమల్లోకి రావడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోవిడ్ పరిస్థితులపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. అనంతరం కీలక ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో రాత్రి కర్ఫ్యూ విధిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని స్పష్టత ఇచ్చారు. అలాగే జనసమూహం లేకుండా చూడాలని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు. ఒకవేళ ఎవరైనా మాస్క్‌లు ధరించకపోతే జరిమానా విధించాలని హెచ్చరించారు.
మరోసారి సినీరంగంపై మహమ్మారి పంజా విసరనుంది. సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ పాటించేలా చూడాలని, అలాగే దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని సీఎం ఆదేశించారు. దేవలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్ ధరించేలా చూడాలని సీఎం ఆదేశించారు.
నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఆ సెంటర్‌లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కోవిడ్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్ని చైతన్యపరచాలని సీఎం ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా మహమ్మారి బారిన పడినా, తగిన వైద్యం అందించేలా మందులు సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.