వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అనే విషయం అందరికీ తెలిసిందే. తనకు అనుకూలమైన వ్యక్తుల్ని పలు రకాల వ్యవస్థల్లో పెట్టుకొని, జగన్ సర్కారును ఆయన ఎప్పటికప్పుడు ఇబ్బందులకు గురిచేస్తున్న విధానాన్ని ప్రజలంతా చూస్తున్నారు. ఇలా వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో పీహెచ్డీ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మరో పెద్ద వ్యవస్థను మేనేజ్ చేస్తానంటున్నారు. అదే గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థ.
గ్రామ వాలంటీర్లకు పోటీగా పచ్చ వాలంటీర్లను నియమించేందుకు రెడీ అవుతున్నారు చంద్రబాబు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వంద ఇళ్లకు ఓ 'ఎల్లో కార్యకర్త'ను నియమిస్తారట. వాళ్లకు సేవామిత్ర అనే పేరు కూడా పెట్టారు. వాలంటీర్ల వ్యవస్థకు పూర్తి వ్యతిరేకంగా ఇది పనిచేస్తుందన్నమాట. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి రేషన్ ఇస్తారు, ఠంచనుగా ఒకటో తేదీ పెన్షన్ ఇస్తారు. కరోనా లాంటి రోగాలు వస్తే వెంటనే హెల్త్ రికార్డ్ అప్ డేట్ చేస్తారు. సచివాలయాల సేవల్ని ఇంటి గుమ్మం వద్దకు తీసుకెళ్తారు.
ఎల్లో వాలంటీర్లు చేసే పని ఇది
అదే టైమ్ లో 'ఎల్లో వాలంటీర్లు' దీనికి పూర్తి రివర్స్ లో పనిచేస్తారు. తమకు కేటాయించిన వంద ఇళ్లను వీళ్లు ఎప్పటికప్పుడు సందర్శిస్తారు. ప్రభుత్వం తెగ అప్పులు చేస్తోందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తుందని చెబుతారు. వివిధ ప్రాంతాల్లో వైసీపీ నేతలు చేస్తున్న ఆగడాల్ని చిలవలు పలవలు చేసి చెబుతారు. ఒకటేముంది.. ఇసుక పాలసీ, మద్యం విధానం నుంచి రోడ్లు స్థితిగతుల వరకు ప్రతి విషయాన్ని ఇంటింటికీ వెళ్లి ఎండగడతారంట వీళ్లు.
అంతేకాదు, రాబోయే ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లగా కూడా వీళ్లనే పెట్టుకోవాలనేది బాబు ప్లాన్. ఈ సేవామిత్ర నియామకాల్ని మరో 6 నెలల్లో పూర్తిచేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. గ్రామ వాలంటీర్లకు ఇస్తున్నట్టే ఎల్లో వాలంటీర్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ గౌరవ వేతనాన్ని ఇచ్చే బాధ్యతను ఆయా నియోజకవర్గంలో ఉన్న కీలక నేతలు, పార్టీ ఇంచార్జీలకు అప్పగించబోతున్నారు. సరిగ్గా ఇక్కడే వ్యవహారం బెడిసికొడుతోంది.
ఎల్లో వాలంటీర్లకు రెండు ఎదురుదెబ్బలు
వీళ్లకు మొదటి ఎదురుదెబ్బ పేమెంట్స్. చంద్రబాబు నియమించే ఈ పసుపు వాలంటీర్లకు జీతాలివ్వడానికి టీడీపీ నాయకులు ఎవ్వరూ ముందుకురారు. ఇప్పటికే కుదేలై ఉన్న నేతలు ఇప్పుడిలా జీతాలిచ్చుకుంటూ కూర్చుంటే, ఎన్నికల నాటికి ఖర్చు చేయడానికి డబ్బులుండవనేది వీళ్ల ఆరోపణ. మరో మెలిక ఏంటంటే.. ఓ నేత పెట్టిన పసుపు వాలంటీర్ కు చంద్రబాబు చెప్పాడని మరో నేత ఎందుకు పేమెంట్ ఇస్తాడు. ఒకవేళ అప్పటికప్పుడు ఇవ్వడానికి ఒప్పుకున్నా, ఎవరైనా ఎన్నాళ్లిలా నడిపిస్తారు.
ఇక పచ్చ వాలంటీర్లకు రెండో ఎదురుదెబ్బ కూడా సిద్ధంగా ఉంది. ఇది చాలా పెద్ద దెబ్బ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోది చెప్పేందుకు, ఎన్ని కుటుంబాలు ఈ టీడీపీ వాలంటీర్లను తమ ఇళ్లలోకి రానిస్తారనేది అతి పెద్ద ప్రశ్న. పైపెచ్చు ఎదురుతిరిగితే దానికి చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఓ మంచి ఉద్దేశంతో, ఉన్నతమైన లక్ష్యంతో జగన్ ఏర్పాటుచేసిన వాలంటీర్ వ్యవస్థ ఎలాంటి సత్ఫలితాలనిస్తుందో అందరం చూస్తున్నాం. దేశం మొత్తం ఈ వ్యవస్థను మెచ్చుకుంటోంది. అలాంటి వ్యవస్థపై ఆరంభం నుంచి విమర్శలు చేస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు.