ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను భయపెట్టినా భయపడరని తెలిసి టీడీపీ, బీజేపీ సరికొత్త ఎత్తులు వేస్తున్నాయి. దీంతో ఆ పార్టీలు తమ పంథా మార్చాయి. నయాన్నో, భయాన్నో పోలీసులను కంట్రోల్‌లోకి తెచ్చుకుని పబ్బం గడుపుకోవాలని ఆ పార్టీల నేతలు రూటు మార్చారు. పోలీస్ యంత్రాంగంపై టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరికలు చేయడం ఇటీవల కాలంలో బాగా పెరగడాన్ని గమనించొచ్చు. రెండేళ్లలో తాను అధికారంలోకి వస్తానని, అప్పుడు తమను ఇబ్బంది పెట్టిన పోలీసుల భరతం పడతానని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తీవ్రస్థాయిలో హెచ్చరించడం తెలిసిందే.
చంద్రబాబు బడిలో చదివి, ప్రస్తుతం బీజేపీ ఒడిలో సేదతీరుతున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌నాయుడు కూడా గురువు బాటలోనే నడుస్తూ పోలీసులపై అవాకులు చెవాకులు పేలుతున్నారనే విమర్శలున్నాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరులో బీజేపీ నాయకుడు శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగింది.
ఇందులో భాగంగా విజయవాడలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో సీఎం రమేశ్ మాట్లాడుతూ పోలీసులపై మరోసారి రెచ్చిపోయారు. అధికార పార్టీకి తొత్తులుగా మారారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబితే అదే గుడ్డిగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. ఆత్మకూరులో చోటు చేసుకున్న పరిణామాలను కేంద్రం పరిశీలిస్తోందన్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుందని ఆయన హెచ్చరించారు.
కొందరు పోలీసులు వైసీపీకి తొత్తులుగా మారడం వల్లే రాష్ట్రంలో హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని సీఎం రమేశ్ ఆరోపించారు. గత నెలలో కూడా సీఎం రమేశ్ పోలీస్ వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేయడాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఏపీ పోలీసుల పనితీరుపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ టెలిస్కోప్‌లో చూస్తోందన్నారు. త్వరలో ఏపీ పోలీస్ వ్యవస్థను భారీగా ప్రక్షాళన చేస్తారన్నారు. అవసరమైతే కొందరు ఐపీఎస్‌లను కేంద్రం రీకాల్ చేస్తుందని సీఎం రమేశ్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో తమకు నచ్చని పార్టీ, నాయకుడు పాలన సాగిస్తున్నారనే అక్కసుతో సీఎం రమేశ్ విమర్శలు చేస్తుండడాన్ని గమనించొచ్చు. చేతనైతే ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎస్‌లను రీకాల్ చేయడానికి ఇంకెంత సమయం కావాలని, ఇంకా ఎన్నాళ్లు టెలిస్కోప్‌లో చూస్తూ కాలం వృథా చేసుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇదంతా టీడీపీ ఆడుతున్న నాటకంలో భాగంగానే సీఎం రమేశ్ పోలీస్ వ్యవస్థపై హెచ్చరికలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌ను భయపెట్టడం, బెదిరించడం చేతకాక…ఇలా పోలీస్ వ్యవస్థపై పడ్డారనే చర్చ నడుస్తోంది. బీజేపీలో ఉన్నా టీడీపీ కూతే కోయడం బాబు కోవర్టుల ప్రత్యేకతగా చెబుతున్నారు.