బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో జాతీయ చానళ్లు చేస్తున్న రచ్చ అంతాఇంతా కాదు. అసలు దేశంలో మరే సమస్య లేనట్టు …నెలల తరబడి సుశాంత్‌సింగ్ ఆత్మహత్యపై డిబేట్లు, ప్రత్యేక కథనాల ప్రసారం జనానికి విసుగు తెప్పించాయి.
సుశాంత్ ఆత్మహత్యకు నెపోటిజమే కారణమంటూ బాలీవుడ్ హీరోయిన్ కంగనా సరికొత్త వాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె ఆరోపణలపై బాలీవుడ్ వర్గాలుగా విడిపోయి విమర్శలు, ప్రతి విమర్శలతో మొత్తానికి బాలీవుడ్ బజారున పడింది.
ఈ వ్యవహారం కాస్తా మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా తీవ్ర విమర్శలు చేసే వరకు వెళ్లింది. ముంబయ్‌ని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో కంగనా పోల్చడం సమస్య తీవ్రతను మరింత పెంచింది. చివరికి ముంబయ్‌లో ఆమె కార్యాలయాన్ని పడగొట్టే వరకు వెళ్లింది.
ఈ నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ ఓ పథకం ప్రకారం కంగనా ఎపిసోడ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేందుకు ఉపయోగిం చుకుంది. తాజాగా రిపబ్లిక్ టీవీ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కథనాలను ప్రసారం చేసిందని, నష్టపరిహారం కింద రూ.200 కోట్లు చెల్లించాలంటూ సుశాంత్ సింగ్ మిత్రుడు , బాలీవుడ్ నిర్మాత సందీప్ సింగ్ కోర్టుకెక్కాడు.
ఇందులో భాగంగా రిపబ్లిక్ టీవీ కార్యాలయానికి, ఆ ఛానల్ ఎడిటర్ అర్నబ్ గోస్వామికి నోటీసులు పంపించాడు. ఛానల్ టీఆర్పీ పెంచుకోవడం కోసం తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార, అసత్య కథనాలను ప్రచారం చేశారని ఆయన నోటీ సుల్లో పేర్కొన్నాడు. సుశాంత్ కేసులో తనను కీలక సూత్రధారిగా, హంతకుడిగా నిర్ధారిస్తూ రిపబ్లిక్ టీవీ కథనాలను ప్రసారం చేసిందని అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సుశాంత్ కేసులో విచారణలో భాగంగా డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి తెచ్చి మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రసారాలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారంటూ బాలీవుడ్ నిర్మాతలు.. రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తాజాగా సుశాంత్ సన్నిహితుడు రిపబ్లిక్ టీవీపై పరువు నష్టం దావా వేయడం ప్రాధాన్యం సంతరించుకొంది.