ఎలుకను పట్టిన సీబీఐ.. సుశాంత్ కేస్ క్లోజ్?

కొండను త్రవ్వి ఎలుకను పట్టడం అంటే తెలుసా? తెలియకపోతే సుశాంత్ సింగ్ కేసును ఓసారి గమనిస్తే ఈజీగా తెలిసిపోతుంది. 4 నెలలుగా తీవ్ర ఉత్కంఠ, మరెంతో మీడియా హడావుడి మధ్య రోజురోజుకు సస్పెన్స్ థ్రిల్లర్…

కొండను త్రవ్వి ఎలుకను పట్టడం అంటే తెలుసా? తెలియకపోతే సుశాంత్ సింగ్ కేసును ఓసారి గమనిస్తే ఈజీగా తెలిసిపోతుంది. 4 నెలలుగా తీవ్ర ఉత్కంఠ, మరెంతో మీడియా హడావుడి మధ్య రోజురోజుకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన సుశాంత్ కేసు తేలిపోయింది. ఈ కేసులో ఏమీ లేదని, కేవలం ఆత్మహత్య మాత్రమే అనే అభిప్రాయానికి సీబీఐ దాదాపు వచ్చేసినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు పూర్తిస్థాయి నివేదిక తయారుచేసే పనిలో పడిన అధికారులు.. మరికొన్ని రోజుల్లో సీబీఐ కోర్టుకు ఆ నివేదికను సమర్పించబోతున్నారు. సుశాంత్ ది కేవలం ఆత్మహత్య మాత్రమేనని, ఎలాంటి హత్య కోణం, కుట్ర అందులో లేదని సీబీఐ, తన నివేదికలో పేర్కొనే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా అప్పుడే కథనాలు షురూ చేసింది.

ఈ కేసులో ఎలాంటి హత్య కోణం లేదని ఎయిమ్స్ వైద్యుల బృందం ఇదివరకే ప్రకటించింది. సుశాంత్ మరణంపై పూర్తిస్థాయి అటాప్సీ రిపోర్టును సీబీఐకి సమర్పించిన ఎయిమ్స్ వైద్యులు.. సుశాంత్ ను హత్య చేసినట్టు తమకు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని స్పష్టంచేశారు. అదే నివేదిక ఆధారంగా సీబీఐ, తన తుది నివేదికను కోర్టుకు సమర్పించే అవకాశం ఉందంటున్నారు.

అటు మనీ ల్యాండరింగ్ కు సంబంధించి రంగంలోకి దిగిన ఈడీ, అందరి బ్యాంక్ ఎకౌంట్స్ పరిశీలించి, ఆరంభంలోనే తమ పని పూర్తిచేసింది. పెద్దగా ఆర్థిక లావాదేవీలు జరగలేదని నిర్థారించింది. ఇక ఈ కేసులో మిగిలింది డ్రగ్స్ కోణం మాత్రమే.

డ్రగ్స్ కోణం వెలుగుచూసిన వెంటనే రంగంలోకి దిగిన ఎన్సీబీ, విచారణను వేగవంతం వేసింది. ఈ క్రమంలోనే సుశాంత్ మాజీ ప్రియురాలు రియాను కూడా అరెస్ట్ చేసింది. అయితే సరైన సాక్ష్యాధారాలు సేకరించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో.. రియా బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కేసును హైలెట్ చేశారనే విమర్శలకు ఇప్పుడు మరింత బలం చేకూరినట్టయింది.

జగన్ కోసం ప్ర‌శాంత్ భూష‌ణ్ డిమాండ్