తెరపైకి చినబాబు.. భారం దించుకుంటున్న బాబు

వయోభారం ఓవైపు, టీడీపీ ఘోర పరాభవ భారం మరోవైపు.. ఈ రెండింటిని ఎప్పుడెప్పుడు దించుకుందామా అని ఎదురు చూస్తున్న చంద్రబాబు.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. చినబాబుకి టీడీపీ పగ్గాలు అప్పగించేందుకు రంగం…

వయోభారం ఓవైపు, టీడీపీ ఘోర పరాభవ భారం మరోవైపు.. ఈ రెండింటిని ఎప్పుడెప్పుడు దించుకుందామా అని ఎదురు చూస్తున్న చంద్రబాబు.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. చినబాబుకి టీడీపీ పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల వరుసగా జరుగుతున్న కొన్ని సంఘటనలు దీనికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

నిన్నటి వరకు ట్విట్టర్లోనే ఉన్న చినబాబుని జనాల్లోకి నెట్టేసి, తాను ట్వీట్లతో కాలక్షేపం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు. అందుకే అమరావతి 300రోజుల ఆందోళనలకు లోకేష్ ని పంపించి.. ఈయన తెరవెనక కూర్చున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి ఉంటే.. ఆ లాంఛనం అప్పుడే పూర్తయ్యేది. అయితే పార్టీ ఘోర పరాభవంతో పాటు ఎమ్మెల్యేగా లోకేష్ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ఆ సాహసం చేయలేదు బాబు.

అయితే ఆ తర్వాతి కాలంలో మెల్లగా చినబాబుని కార్యకర్తలపై రుద్దే కార్యక్రమం జోరందుకుంది. అనంతపురంలో జేసీ సోదరులను పరామర్శించేందుకు లోకేష్ ని పంపించారు బాబు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడి కుటుంబాన్ని కూడా చంద్రబాబు ప్రతినిధిగా లోకేష్ వెళ్లి ఓదార్చి వచ్చారు.

ఇక అమరావతి ఆందోళనల్లో కూడా బాబు తన ప్రాతినిధ్యం తగ్గించుకుని కొడుకుని ప్రమోట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే.. పార్లమెంటరీ నియోజకవర్గాలకు నియమించిన మహిళా ఇంచార్జ్ లు, ప్రధాన కార్యదర్శుల ప్రమాణ స్వీకారోత్సవం చినబాబు చేతులమీదుగా జరగడం మరో ఎత్తు.

వాస్తవానికి పార్టీ అధినేత ఇలాంటి కార్యక్రమానికి హాజరవుతారు, పోనీ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయినా అక్కడ ఉండాలి. అయితే ఎవరూ లేకుండానే ఆ తంతు ముగించారు. కేవలం చినబాబు మాత్రమే వారితో ప్రమాణ స్వీకారం చేయించి.. సూక్తి ముక్తావళి వల్లించారు. దీంతో పార్టీపై లోకేష్ పెత్తనం క్రమక్రమంగా పెరుగుతుందనే క్లారిటీ శ్రేణుల్లోకి వెళ్లింది.  

లోకేష్ నాయకత్వంలో పార్లమెంటరీ నియోజకవర్గాల మహిళా ఇంచార్జుల ప్రమాణ స్వీకారం జరిగినట్టే.. రాష్ట్ర అధ్యక్షుల ప్రమాణ స్వీకారం కూడా ముగుస్తుందని తెలుస్తోంది. పార్టీకి సంబంధించి సీనియర్ లు ఎవరూ లేకుండానే లోకేష్ ఒక్కడే ఆయా అధ్యక్షులతో సమావేశమవుతారన్నమాట.

చంద్రబాబు పరోక్షంలోనే ఇదంతా జరుగుతున్నా.. చినబాబుని ఎలివేట్ చేయడం కోసం బాబు తనకు తాను సైడైపోతున్నారన్నమాట. మొత్తమ్మీద పతనావస్థలో ఉన్న టీడీపీ.. లోకేష్ కి పగ్గాలు అప్పగిస్తే పూర్తిగా పతనం కావడం మాత్రం గ్యారెంటీ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

జగన్ కోసం ప్ర‌శాంత్ భూష‌ణ్ డిమాండ్