భారతీయుడు 2 సినిమా సెట్స్ పై పెద్ద ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక భారీ క్రేన్ కింద పడటంతో దాని కింద పడి పలువురు గాయపడగా, ముగ్గురు మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. చెన్నైలోని ఒక స్టూడియోలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సినిమా సిబ్బంది వేసుకున్న టెంట్ల మీద క్రేన్ పడినట్టుగా సమాచారం. ఆ సమయంలో దర్శకుడు శంకర్ తన సహాయకులతో కలిసి చిత్రీకరించిన దృశ్యాలను మానిటర్ లో వీక్షిస్తున్నట్టుగా సమాచారం. సరిగ్గా వారి టెంట్ మీదకే క్రేన్ పడిపోయినట్టుగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంతో శంకర్ సహాయకులు ముగ్గురు మరణించినట్టుగా తెలుస్తోంది. అలాగే మరో పదిమంది వరకూ గాయపడినట్టుగా సమాచారం. ఈ దర్శకుడు శంకర్ కూడా క్షత్రగాత్రుల్లో ఒకరని తెలుస్తోంది. ఆయన కూడా గాయపడ్డారని, వీరందరినీ ఆసుపత్రికికి తరలించినట్టుగా తెలుస్తోంది.
సంఘటనపై కమల్ హాసన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. వారి మరణం తనను కలిచి వేసిందని కమల్ అన్నారు. తన బాధ కన్నా వారి కుటుంబీకుల బాధ తీవ్రమైనదని కమల్ పేర్కొన్నారు. సినిమా షూటింగుల సమయాల్లో ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది మాత్రం తీవ్రమైన ప్రమాదం. 150 అడుగుల క్రేన్ పడటంతోనే ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉందని తెలుస్తోంది.