బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన ఘటనలో అరెస్టైన నిందితుల్లో ఒకడైన అనూజ్ థాపన్ జైళ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. బాంద్రాలోని సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిగిన ఘటనలో ఇతడే ఆయుధాలు సరఫరా చేశాడని ఆరోపిస్తున్నారు పోలీసులు.
క్రాఫోర్డ్ మార్కెట్ సమీపంలోని ముంబై పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని క్రైమ్ బ్రాంచ్ లాకప్‌లో అనూజ్ ను ఉంచారు. ఆర్థిక నేరాల కింద అరెస్ట్ అయిన 11 మందితో కలిపి అనూజ్ థాపన్ ను ఓ సెల్ లో ఉంచారు. ఈరోజు ఉదయం నుంచి అనూజ్ కంగారుగా ఉన్నట్టు 11 మందిలో ఒకరు చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవస్థీకృత నేరాల నియంత్రిత చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని అతడు పదేపదే చెబుతూ వచ్చాడట.
ఈ క్రమంలోనే మధ్యాహ్నం 12.30కు బాత్రూమ్ కు వెళ్లాడు అనూజ్. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తోటి ఖైదీలు బాత్రూమ్ కు వెళ్లి చూడగా.. కిటికీకి ఉరేసుకొని అనూజ్ ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.
వెంటనే అతడ్ని సమీపంలో ఉన్న గోకుల్ దాస్ తేజ్ పాల్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించడంతో, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జేజే హాస్పిటల్ కు తరలించారు. జరిగిన ఘటనపై కేసు నమోదైంది. మహారాష్ట్ర సీఐడీ రంగంలోకి దిగింది, జైలులో పోలీసులందర్నీ విచారించనుంది.
సల్మాన్ ఇంటిపై విక్కీ కుమార్ గుప్తా, సాగర్ కుమార్ పాల్ కాల్పులు జరిపారు. వీళ్లకు ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తి అనూజ్. ట్రక్ క్లీనర్ గా పనిచేసిన అనూజ్, ఆ తర్వాత గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లో చేరాడు. అతడి సూచనల మేరకు, సల్మాన్ ఇంటిపై కాల్పుల కోసం ఆయుధాల్ని సప్లయ్ చేశాడు. అరెస్ట్ చేసిన సమయంలో అనూజ్ నుంచి పోలీసులు కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.