బొబ్బిలిలో ఎప్పుడూ వైసీపీదే విజయం. ఆ పార్టీ 2014, 2019లలో వరుసగా రెండు సార్లూ బొబ్బిలి నుంచి విజయ ఢంకా మోగించింది. 2024లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సక్సెస్ ని సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2019లో మొత్తం 9 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటుని వైసీపీ కైవశం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఎన్నికల్లో బొబ్బిలిలో భీకర పోరు సాగనుందని అంచనాలు వెలువడుతున్నాయి.
బొబ్బిలి రాజులు 2019లో ఓటమి పాలు అయ్యారు. మొదట కాంగ్రెస్ ఆ మీదట వైసీపీలో చేరి ఓటమి ఎరగని వీరులుగా ఉన్న బొబ్బిలి రాజు సుజయ క్రిష్ణ రంగారావు సైకిలెక్కి తొలిసారి మాజీ ఎమ్మెల్యే అయ్యారు. ఈసారి ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. తమ్ముడు బేబీ నాయన పోటీలో ఉన్నారు.
బొబ్బిలిలో టీడీపీ గతానికంటే ఇప్పుడు బలంగా ఉంది. వైసీపీ కూడా అంతే స్థాయిలో పోటీని ఇస్తోంది. అయితే ఈసారి తమ విజయం ఖాయమని టీడీపీ చెప్పుకుంటోంది. చంద్రబాబు ఇటీవల బొబ్బిలి వచ్చినప్పుడు నిర్వహించిన సభలకు జనాలు తరలివచ్చారని ఆ పార్టీ గుర్తు చేస్తోంది.
అయితే జగన్ బొబ్బిలి సభతో మొత్తం అంచనాలు మారిపోతున్నాయి. మే నెల వేసవి ఎండలలో మిట్ట మధ్యాహ్నం సభ పెడితే జనాలు పోటెత్తారు. ఎక్కడ చూసినా జన సందోహమే కనిపించింది. దాంతో వైసీపీ నేతలు బొబ్బిలి కోట మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు సభలు అన్నీ రాత్రి వేళలలో జరిగాయని పగలు సభ పెడితే ఎండలను సైతం ఖాతరు చేయకుండా జనాలు విరగబడి వచ్చారంటే అది దేనికి సంకేతం అని అంటున్నారు. జగన్ బొబ్బిలి గర్జన ఇలా ఉంటుందని సభ నిరూపించింది అని అంటున్నారు.
జగన్ సభ సూపర్ హిట్ కావడంతో వైసీపీ శ్రేణులు ఆనందంతో ఉంటే టీడీపీలో అంతర్మధనం మొదలైంది. సెంటిమెంట్ ప్రకారం చూస్తే టీడీపీకి ఈసారి కూడా ఎదురు గాలేనా అన్న చర్చ సాగుతోంది. మూడు దశాబ్దాలుగా టీడీపీ గెలవని సీటు బొబ్బిలి. ఈసారి అదే రిపీట్ అయితే సైకిల్ పార్టీకి ఇబ్బందులే అంటున్నారు.