వైసీపీ ఎంపీ అభ్యర్ధికి ఇంట్లోనే ప్రత్యర్ధి!

రాజకీయ ప్రత్యర్ధులు ఎక్కడో ఉండరు ఇంట్లోనే ఉంటారు అన్నది ఏపీ పాలిటిక్స్ ని చూస్తే అర్ధం అవుతుంది. అన్న చెల్లెళ్ళ మధ్య పోరు, అన్న దమ్ములు తండ్రీ కొడుకులు, అబ్బాయ్ బాబాయ్ ఇలా ఎదురు…

రాజకీయ ప్రత్యర్ధులు ఎక్కడో ఉండరు ఇంట్లోనే ఉంటారు అన్నది ఏపీ పాలిటిక్స్ ని చూస్తే అర్ధం అవుతుంది. అన్న చెల్లెళ్ళ మధ్య పోరు, అన్న దమ్ములు తండ్రీ కొడుకులు, అబ్బాయ్ బాబాయ్ ఇలా ఎదురు నిలిచి తొడ కొడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రాజకీయం ముందు రక్త బంధానికి విలువ తక్కువ అని రుజువు చేసే సంఘటనకు ఇవన్నీ.

ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి నుంచి వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు విజయం నల్లేరు మీద నడక అని అంతా అనుకుంటున్నారు. మంచి వాడు సౌమ్యుడు వివాదరహితుడు ఓటమి ఎరగని నేత ఇలా చాలానే బూడికి కితాబులు ఉన్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే ఆయన సొంత కొడుకే తండ్రికి ఎదురు నిలిచారు. మాడుగుల అసెంబ్లీ నుంచి పోటీ చేసే చాన్స్ తనకు ఇవ్వకుండా అప్ప చెల్లెలుకు ఇచ్చారని ఆయన ఆగ్రహంతో ఇండిపెండెంట్ గా మాడుగుల నుంచి పోటీకి దిగారు.

అంతటితో ఆగకుండా సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టర్లను రిలీజ్ చేస్తూ నాన్నకు ఓటేయకండి అని యాంటీ కాంపెయిన్ స్టార్ట్ చేశాడు. కొడుకునే చూడని తండ్రి ప్రజలను ఏమి చూస్తారు అని అంటూ బూడి మీద సొంత కుమారుడే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అసలే టీడీపీ కూటమి అభ్యర్ధి సీఎం రమేష్ అంగబలం అర్ధబలం వ్యూహాలతో సతమతమవుతున్న వైసీపీకి ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కొడుకు రూపంలోనే ఎదురు దెబ్బ ఏమిటి అని తర్కించుంటున్నారు.

బూడి తన కుమారుడి విషయంలో బుజ్జగింపులు చేసి సర్దుబాటు చేసుకోవాలని కూడా సూచనలు వస్తున్నాయట. అయితే అవి ఫలిస్తాయా అన్న టెన్షన్ ఉంది. గతంలో కుమారుల మీద మోజుతో వారికి పదవులు ఇచ్చి సన్ స్ట్రోక్ తిన్న నేతలను అంతా చూసారు. ఇప్పుడు పదవి ఇవ్వని కారణంగా రోడేక్కిన తీరుతో బూడికి సన్ స్ట్రోక్ తగుతోంది అని అంటున్నారు. టీడీపీ కూటమి మాత్రం ఈ చోద్యాన్ని బాగానే చూస్తోంది.