జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భారీ హామీ ఇచ్చారు. తాను చెప్పిన వారిని గెలిపించండి, వారి చేత తాను పని చేయిస్తాను ఆయన అంటున్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన ఎన్నికల సభకు హాజరయిన పవన్ మాట్లాడుతూ మీరు నన్ను అడగవచ్చు.
మీరేమో ఫలానా వారికి ఓటేయమని చెబుతున్నారు. వారు ఓటు వేసిన తరువాత పనులు చేయకపోతే ఎలా అన్న డౌట్లు ఉండొచ్చు. కానీ మీ పవన్ మీకు అండగా ఉంటారు. నేను ఎక్కడికీ పారిపోను, అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అలాగే జనసేన పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబులను గెలిపిస్తే వారిచేత పని చేయిస్తా ఇదే నా హామీ అని పవన్ అంటున్నారు.
అయితే 2014లో టీడీపీ బీజేపీ ప్రభుత్వం విషయంలో కూడా పవన్ పనిచేయకపోతే ప్రజల తరఫున ప్రశ్నిస్తాను అని చెప్పారు. కానీ ఆచరణలో అది ఎంతమేరకు నెరవేరింది అన్న డౌట్లూ ఉండనే ఉన్నాయని అంటున్నారు. సీఎం రమేష్ అంటే ఎక్కడో కడప వాసి. ఆయనకు వేయి వ్యాపకాలు, కోటి బిజినెస్ పనులు.
ఆయనను పట్టుకుని పనిచేయించడం సాధ్యమేనా అన్నదే పెద్ద ప్రశ్న. ఆయన స్థానికుడు అయితే ఏదో సమయానికైనా వచ్చే వీలు ఉంటుంది. ఆయన ఉండేది ఎక్కడో కదా అని అంటున్నారు. పవన్ హామీలను నమ్మి ఓట్లు వేస్తే 2014 నాటి అనుభవాలే అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.