ఈ ఎన్నికల సీజన్ లో కేంద్ర ఎన్నికల సంఘం కత్తి ఝుళిపించడం మొదలైంది. వేటు మొదటిసారిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట మీదనే పడింది.
వర్తమాన రాజకీయాలలో నోటి దూకుడు మాటలకు పేరు మోసిన వారిలో ఒకరు కేసీఆర్. చాలా సహజమైన తెలంగాణ మాండలికంలోని గ్రామీణ మొరటు సామెతలను అలవోకగా ఉపయోగిస్తూ ప్రత్యర్థులను ఆడిపోసుకోవడానికి ఎడాపెడా మాటల అస్త్రాలు సంధించడంలో ఆయనకు ఆయనే సాటి.
మామూలు రోజుల్లో ఇలాంటి తిట్ల దండకం, దూషణలపర్వం ఎలాగైనా నడుస్తుందేమో గాని… ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రచార పర్వంలో నోరు జారితే మూల్యం చెల్లించుకోవలసి వస్తుందనే పాఠాన్ని ఆయనే ఇప్పుడు నేర్చుకుంటున్నారు.
ఆ మాటకొస్తే ఇప్పటి రాజకీయాలలో తమ తమ రాజకీయ ప్రత్యర్థుల మీద, వారి విధానాలు, వారి పార్టీల సిద్ధాంతాలు, పోకడల మీద నిర్మాణాత్మక విమర్శలు అనేవి పూర్తిగా కనుమరుగైపోయాయి. కేవలం వ్యక్తిగత దూషణం, వ్యక్తిత్వ హననం, బూతులు తిట్టడం రాయడానికి వీలు లేని అత్యంత అసహ్యకరమైన భాషలో మాట్లాడడం తప్ప నేటి రాజకీయ నాయకులు అనుసరిస్తున్న విధానం మరొకటి లేదు.
ప్రత్యేకించి కెసిఆర్ ఒక్కరే ఇలాంటి దూకుడు ప్రదర్శిస్తున్నారని అనలేం. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ ఇటు తెలంగాణలో గాని మిగిలిన వారందరూ శుద్ధ పూసలని, కడిగిన ముత్యాలని అనుకోవడానికి కూడా వీలులేదు. అయితే ఎన్నికల సంఘం నిర్దిష్టంగా కొన్ని నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకుంటుందనే స్పృహ వారిలో ఉండి కాస్త అదుపులో ఉండి తిట్టే లాగా నడిపిస్తూ ఉంటుంది. ఆవేశంలో ఒళ్ళు తెలియకుండా తిట్లను కొనసాగిస్తూ పోతే ఈసీ నిబంధనలకు ఉండగల సరిహద్దు రేఖను తెలిసో తెలియకో దాటేస్తే ఇప్పుడు కెసిఆర్ కు ఎదురైన అనుభవమే ఎదురవుతుంది.
కెసిఆర్ కాంగ్రెస్ నాయకుల మీద చేసిన విమర్శలకు సంబంధించి ఎన్నికల సంఘం ఆయన మీద 48 గంటల నిషేధం విధించింది. ఇంకొక పది రోజుల దూరంలోనే ఎన్నికలు ఉన్న తరుణంలో ఒక నియమిత షెడ్యూలు ప్రకారం రోజుకు కొన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తూ నాయకులు తిరుగుతున్న సమయంలో- ఇలా రెండు రోజులు నిషేధం వారికి పెద్ద దెబ్బ.
అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అనేక పార్టీల నాయకులు ఇలాంటి అతి డైలాగులను మాట్లాడుతూ ఉన్నారు. వారు కూడా ఇప్పుడు కొద్దిగా అదుపు పాటించాలి. ఖచ్చితమైన సమాచారం ఫిర్యాదు ఉంటే గనుక వేటు వేయడానికి ఈసీ వెనుకాడడం లేదు అనేది వారు తెలుసుకోవాలి. ఏం మాట్లాడుతున్నామో నోటిమీద అదుపు మాట గురించిన స్పృహ కలిగి ఉండి మాట్లాడితే వారికే మంచిదని ప్రజల వ్యాఖ్యానిస్తున్నారు.