ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్‌ను తెలంగాణ సర్కార్ స్ఫూర్తిగా తీసుకుంది. రాజకీయంగా జగన్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విభేదిస్తున్నప్పటికీ, పాలనా పరంగా ఆదర్శంగా తీసుకోవడం విశేషం. ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వలంటీర్ వ్యవస్థను తెలంగాణలో కూడా తీసుకురానున్నారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో, పట్టణాల్లో వలంటీర్ వ్యవస్థను తీసుకొస్తామని వెల్లడించారు. వలంటీర్ల ద్వారా ప్రజలందరికీ పథకాలు నేరుగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఒక్కో వలంటీర్‌కు నెలకు రూ.10 వేలు చొప్పున అందిస్తామని ఆయన వెల్లడించారు.
జగన్ సుపరిపాలనకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని వైసీపీ ప్రశ్నిస్తోంది. జగన్‌ను రేవంత్‌రెడ్డి రాజకీయంగా విభేదిస్తున్నప్పటికీ, తమ నాయకుడు తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థను తెలంగాణలో తీసుకొస్తామనడం సంతోషించదగ్గ విషయమని వైసీపీ నేతలు తెలిపారు. దీంతో తెలంగాణలో సైతం జగన్ మార్క్ పాలన చూడబోతారని వారు పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ, ప్రజలకు వారధిగా వలంటీర్ వ్యవస్థ పని చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు ఏపీకి వచ్చి సచివాలయ, వలంటీర్ వ్యవస్థపై అధ్యయనం చేసి వెళ్లాయి. ఈ వ్యవస్థను తమ రాష్ట్రాల్లో ప్రవేశ పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ చేరనుండడం విశేషం. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. సచివాలయాలకు అనుసంధానంగా వలంటీర్లను జగన్ సర్కార్ నియమించింది. ఈ వలంటీర్లపై ప్రతిపక్షాలు నిత్యం విషం చిమ్మాయంటే, ఎంతగా భయపడ్డాయో అర్థం చేసుకోవచ్చు.