తమిళ నటుడు విక్రమ్ కరోనా బారిన పడ్డాడు. 2 రోజులుగా స్వల్పంగా తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్న విక్రమ్ ను ఆల్వార్ పేట్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే లక్షణాలు స్వల్పంగానే ఉండడంతో ఆయన్ను ఇంటికి పంపించి ఐసొలేషన్ లో ఉంచారు. హాస్పిటల్ నుంచి ఇద్దరు వైద్యుల్ని ప్రత్యేకంగా విక్రమ్ ఇంటికి పంపించారు.
ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ లో ఉన్నారు విక్రమ్. 3 రోజుల కిందట ఓ యాడ్ షూట్ లో కూడా పాల్గొన్నారు. దీంతో పాటు 2 సినిమాలకు ఒకేసారి డబ్బింగ్ కూడా చెబుతున్నారు. వీటిలో మణిరత్నం సినిమా కూడా ఉంది. దీంతో ఆయనకు ఎక్కడ వైరస్ సోకి ఉంటుందనే విషయంపై అధికారులు తేల్చుకోలేకపోతున్నారు.
మరోవైపు విక్రమ్ అన్ని రకాల కరోనా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు అతడి వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. రెగ్యులర్ గా ఆయన మాస్క్ పెట్టుకుంటున్నారని, చేతులు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు భౌతిక దూరం పాటిస్తున్నారని ప్రకటించారు.
సెకెండ్ వేవ్ లో అతలాకుతలమైన తమిళనాడును ఆదుకునేందుకు కోలీవుడ్ అంతా ముందుకొచ్చింది. కరోనాపై పోరాటంలో భాగంగా సినీ హీరోలంతా ప్రభుత్వానికి విరాళాలు అందించారు. ఆ టైమ్ లో విక్రమ్ కూడా తన వంతుగా 30 లక్షల రూపాయాల్ని సీఎం సహాయనిధికి అందించాడు. ఇప్పుడు అతడే కరోనా బారిన పడ్డాడు. ఒమిక్రాన్ అనుమానాల నేపథ్యంలో విక్రమ్ శాంపిల్ ను, జినోమ్ సీక్వెన్సింగ్ కు కూడా పంపించబోతున్నారు.