మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయింది. ఆమె పేరు అర్చన అలియాస్ వేద. పలు తెలుగు సినిమాల్లో నటించిన ఈమె ఇప్పుడు పెళ్లి చేసుకోబోతోంది. నిన్న రాత్రి అర్చన ఎంగేజ్ మెంట్ జరిగింది. బంజారాహిల్స్ లోని హోటల్ రాడిసన్ బ్లూలో అర్చన-జగదీష్ ల నిశ్చితార్థం పూర్తయింది. ఓ హెల్త్ కేర్ కంపెనీలో వైస్-ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు జగదీష్. త్వరలోనే వీళ్ల పెళ్లి తేదీని ప్రకటిస్తారు.
అర్చన కెరీర్ అనుకున్నంత సాఫీగా సాగలేదు. తపన అనే సినిమాతో వేద పేరుతో పరిచయమైన ఈ అమ్మాయి ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. కానీ ఏదీ కలిసిరాలేదు. ఆ తర్వాత జాతకరీత్యా తన పేరును వేద నుంచి అర్చనగా కూడా మార్చుకుంది. అయినప్పటికీ ఆమెకు కెరీర్ కలిసిరాలేదు. చివరికి బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. ఆ క్రేజ్ కూడా ఆమెకు కలిసిరాలేదు.
ప్రస్తుతం ఆమె అరకొరగా మాత్రమే సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన మూవీ వజ్రకవచధర గోవింద. సప్తగిరి హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె లేడీ విలన్ గా కనిపించింది. అయితే ఈ సినిమా కూడా ఆమెకు ప్లస్ అవ్వలేదు. మధ్యలో పలు కన్నడ చిత్రాల్లో కూడా ఆమె కనిపించింది. తెలుగులో ఖలేజా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, యమదొంగ, బలుపు, లయన్ చిత్రాలు ఆమెకు కాస్త పేరుతెచ్చిపెట్టాయి.
రాత్రి జరిగిన నిశ్చితార్థానికి టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అర్చనతో బిగ్ బాస్ లో పాల్గొన్న బ్యాచ్ అంతా వచ్చింది. నవదీప్, శివబాలాజీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. హీరో సుమంత్ కూడా హాజరయ్యాడు.