సోషల్ మీడియాలో టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని అనరాని మాటలంటున్నారని, జుగుప్సాకరంగా తిట్టిపోస్తున్నారంటూ చంద్రబాబు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. గంటసేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో నానా హంగామా చేశారు. అంతా ఓకే కానీ అసలు ఇలాంటి విమర్శలు చేయడం ఎవరు మొదలు పెట్టారు? ఇలా ఆలోచిస్తే మళ్లీ చంద్రబాబే దోషిగా మిగులుతారు, టీడీపీయే ఈ వ్యవహారంలో తొలి ముద్దాయి అవుతుంది. బాబు ఇప్పుడిలా బీద అరుపులు అరుస్తుంటే, గతంలో ఆయన, ఆయన అనుచరగణం చేసిన ఆగడాలు తెరమరుగైపోతాయా?
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు సోషల్ మీడియాని ఎంత నీఛంగా వాడారో అందరికీ తెలుసు. జగన్ ని ఏ-1 అని మాత్రమే సంబోధించేవారు, జగన్ పాదయాత్రని అడుగడుగునా అపహాస్యం చేశారు. జగన్ ఆప్యాయంగా తలనిమిరి, అభిమానంతో దగ్గరకు తీసుకుంటే.. ముద్దులు పెడుతున్నాడంటూ రాద్ధాంతం చేశారు. జగన్ క్లిప్పింగ్ లకు ఆడియో సాంగ్స్ జోడించి మరీ అవహేలన చేశారు. అప్పుడు బాబుకు నీతి గుర్తుకురాలేదు. ఇవన్నీ ఆయన మర్చిపోయినా, ప్రజలు మరిచిపోరు.
ఇక జగన్ సోదరి షర్మిలపై నీచాతి నీఛంగా కామెంట్లు పెట్టినవారిని ఏం చేయాలి, ఈ వ్యవహారంలో అసలు ముద్దాయిలు టీడీపీకి చెందినవారే అని తేలినా అప్పుడు చంద్రబాబు ఎందుకు నోరు మెదపలేదు? తనను, తన కుటుంబ సభ్యుల్ని అంత దారుణంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేసినా జగన్ ఏనాడూ ఇలా స్పందించలేదు. హుందాగానే వ్యవహరించారు. చట్టపరంగానే నడుచుకున్నారు. ఇవన్నీ బాబు మరిచిపోయినా, ప్రజలు మరిచిపోరు.
కామెంట్ల విషయంలో సోషల్ మీడియాని ఎవరూ ఆపలేరు, ఆ విషయం చంద్రబాబుకి కూడా తెలుసు. అంతగా వారిపై చర్యలు తీసుకోవాలంటే దానికో పద్ధతి ఉంది. పోలీసులకు సరైన ఆధారాలతో ఫిర్యాదు చేయాలి. చంద్రబాబు కూడా ఆ పనిచేశారు. కానీ దాన్ని కూడా తన పబ్లిసిటీకి వాడుకోవడం కోసం ఇలా నీచంగా మీడియాముందుకొచ్చారు. తమవారు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని, వైసీపీ నేతలపై కామెంట్లు చేయకపోయినా టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారంటూ ఏడుపు మొదలుపెట్టారు.
తనే స్వయంగా బూతులు చదివి వినిపించారు. ఇంతకంటే సిగ్గుమాలినతనం ఇంకోటి ఉండదు. గతంలో జగన్ ఎప్పుడూ ఇలా వ్యవహరించలేదు. అంతెందుకు జగన్ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలోకి వచ్చేసింది. చంద్రబాబు, లోకేష్ కూడా తమ పోస్టింగ్ లకు ఈ హ్యాష్ ట్యాగ్ వాడుతున్నారంటే వారి ఫ్రస్టేషన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 151 సీట్ల భారీ మెజార్టీ ఉన్న సీఎంను నెలరోజుల్లోనే ఫెయిలైనట్టు చంద్రబాబు ఎలా డిసైడ్ చేస్తారు.
ముఖ్యమంత్రిపై మరీ ఇంత దిగజారి పోస్టింగ్ లు పెడుతున్న చంద్రబాబుని పోలీసులు ఎందుకు వదిలిపెట్టాలి. ఈ లెక్కలన్నీ తీస్తే.. అసలు నిన్న ప్రెస్ మీట్ పెట్టే అధికారం, అర్హత రెండూ చంద్రబాబుకి లేవనే చెప్పాలి.