ఒకప్పటి హీరోయిన్ స్నేహ మరోసారి గర్భవతి అయింది. ఆమె శ్రీమంతం నిన్న చెన్నైలో ఘనంగా జరిగింది. కేవలం స్నేహ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగగా.. తర్వాత ఈ ఫొటోల్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం స్నేహ ఆరోగ్యంగా ఉందని, మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించాడు ఆమె భర్త, నటుడు ప్రసన్న.
2012లో స్నేహ-ప్రసన్న పెళ్లి చేసుకున్నారు. వీళ్లది ప్రేమ వివాహం. వీళ్ల పెళ్లి సమయంలో రెండు కుటుంబాల మధ్య తలెత్తిన గొడవలు అప్పట్లో చిన్న దుమారం రేపాయి. అలా ఓ ఇంటివారైన స్నేహ-ప్రసన్నకు విహాన్ అనే కొడుకు ఉన్నాడు. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది స్నేహ.
పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ కొనసాగిస్తోంది స్నేహ. హీరోయిన్ పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. తెలుగులో ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, వెంకీ, శ్రీరామదాసు లాంటి సినిమాల్లో నటించిన స్నేహ ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది. ప్రస్తుతం నటనకు చిన్న విరామం ఇచ్చిన ఈ నటి, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ యాక్టింగ్ కెరీర్ కొనసాగించనుంది.