చర్చలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. ఈరోజు చర్చలు సఫలం కాకపోతే తెలంగాణ ఆర్టీసీ సమ్మె బాట పట్టడం ఖాయం. అదే జరిగితే దసరాకు ప్రయాణికులు అష్టకష్టాలు పడడం అంతకంటే ఖాయం. ఆర్టీసీ కార్మికుల జేఏసీ, ఐఏఎస్ అధికారుల కమిటీ మధ్య చర్చలు మరోసారి విఫలమయ్యాయి. జేఏసీ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని, 30 రోజుల్లోగా సమస్యల్ని పరిష్కరిస్తామని అధికారులు ప్రతిపాదించగా.. ఆర్టీసీ జేఏసీ వ్యతిరేకించింది. చర్చల్ని కావాలనే సాగదీస్తున్నారని, ఆర్టీసీ విలీనంపై కచ్చితమైన హామీ ఇచ్చిన తర్వాతే గడువు నిర్ణయించాలని డిమాండ్ చేసింది. తమపై ఎస్మా ప్రయోగించినా తగ్గేది లేదని స్పష్టంచేసింది.
చర్చలకు సమయం ఈరోజు మాత్రమే మిగిలింది. ఇవాళ కూడా చర్చలు విఫలమైతే, రేపట్నుంచి ఆర్టీసీ సమ్మె మొదలవుతుంది. డ్రైవర్లు, కండక్టర్లతో పాటు కార్మికులెవరూ విధుల్లోకి వెళ్లరు. తమ 26 డిమాండ్లను పరిష్కరించే వరకు విధుల్ని బహిష్కరిస్తామని కార్మికులు పదేపదే చెబుతూ వస్తున్నారు. మిగతా సమస్యల సంగతి పక్కనపెడితే.. కనీసం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనే హామీ ఇచ్చినా విధుల్లోకి చేరడానికి తమకు అభ్యంతరం లేదని జేఏసీ స్పష్టంచేసింది.
మరోవైపు ప్రభుత్వం మాత్రం అస్సలు తగ్గడంలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. దసరా సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లతో ఆర్టీసీ బస్సుల్ని నడిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు నుంచి ప్రత్యేక రిక్రూట్ మెంట్ డ్రైవ్ స్టార్ట్ చేసింది. డ్రైవర్ కు రోజుకు 1500, కండక్టర్ కు వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో చర్చలు ఇక కొలిక్కిరావనే విషయం అర్థమౌతూనే ఉంది. అదే జరిగితే తెలంగాణ ప్రజలకు ఇక్కట్లు తప్పవు. దసరా శెలవుల సందర్భంగా ప్రయాణించే ప్రయాణికులతో పాటు సాధారణ ప్రయాణికులకు కూడా ఇక్కట్లు తప్పకపోవచ్చు.
ఓవైపు తాత్కాలిక డ్రైవర్లలో బస్సులు నడిపించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతున్నప్పటికీ…. ప్రతిపక్షాలు, పౌర-ప్రజావేదికలతో కలిసి ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కడికక్కడ బస్సులు అడ్డుకునే అవకాశం ఉంది.