15 ఏళ్ల కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్.. ఓవర్ నైట్ స్టార్ డమ్

ప్రతి శుక్రవారం నటీనటుల జాతకాలు మారిపోతాయంటారు. అది నిజమే. అప్పటివరకు వరుసగా హిట్స్ ఇచ్చినవాళ్లకు ఫ్లాప్ రావొచ్చు, వరసుగా ఫ్లాపులిచ్చిన వాళ్లు ఉన్నఫలంగా హిట్ కొట్టొచ్చు. ఏదైనా జరగొచ్చు. అద్భుతాలు జరిగే పరిశ్రమ ఇది.…

ప్రతి శుక్రవారం నటీనటుల జాతకాలు మారిపోతాయంటారు. అది నిజమే. అప్పటివరకు వరుసగా హిట్స్ ఇచ్చినవాళ్లకు ఫ్లాప్ రావొచ్చు, వరసుగా ఫ్లాపులిచ్చిన వాళ్లు ఉన్నఫలంగా హిట్ కొట్టొచ్చు. ఏదైనా జరగొచ్చు. అద్భుతాలు జరిగే పరిశ్రమ ఇది. ఈమధ్య అలాంటి అద్భుతమే జరిగింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ది కేరళ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్టయింది.

ఆమధ్య ది కశ్మీర్ ఫైల్స్ హిట్ అయింది, ఇప్పుడు ది కేరళ స్టోరీ బ్లాక్ బస్టర్ అయింది. ఇలాంటి సైలెంట్ హిట్స్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వస్తుంటాయి. అయితే ఇక్కడ మేటర్ ఇది కాదు. ది కేరళ స్టోరీ అనే ఒకే ఒక్క సినిమా అదా శర్మ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. 15 ఏళ్లుగా నటనారంగంలో కొనసాగుతున్న అదా శర్మ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది

2008లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ, ఈ 15 ఏళ్లలో తక్కువ సినిమాలు చేసింది. అదే టైమ్ లో చాలా తక్కువ సక్సెస్ రేట్ కూడా అందుకుంది. హసీ తో ఫసీ, కమాండో లాంటి సినిమాలు మినహాయిస్తే ఆమె కెరీర్ గురించి చెప్పుకోడానికేం లేదు. ఇక అదా శర్మ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.

హార్ట్ ఎటాక్ తో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, గరం, క్షణం, కల్కి లాంటి సినిమాలు చేసింది. వీటిలో సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం లాంటి సినిమాలు హిట్టయినప్పటికీ అదా కెరీర్ కు కలిసొచ్చిందేం లేదు.

అయితే కెరీర్ ఎంత మందకొడిగా సాగుతున్నప్పటికీ అదా నిరాశ చెందలేదు. ఓవైపు గ్లామర్ పాత్రలు పోషిస్తూనే, మరోవైపు తన మనసుకు నచ్చిన కథల్ని సైతం ఆమె వదులుకోలేదు. ఇందులో భాగంగా ఏడాది కిందట ఆమె అంగీకరించిన సినిమా ది కేరళ స్టోరీ.

ఆ కథ అదాకు బాగా నచ్చింది. నటించడానికి మంచి స్కోప్ ఉంటుందని భావించింది. అందుకే ఓకే చేసింది. అప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడామెను బాలీవుడ్ లో స్టార్ ను చేసింది. కేరళ స్టోరీ  సినిమా ఉత్తరాదిని ఓ ఊపు  ఊపేస్తోంది. అలియాభట్ నటించిన గంగూభాయ్ సినిమాను మించి వసూళ్లు సాధిస్తోంది.

అలా ఊహించని విధంగా అదా శర్మ బాలీవుడ్ స్టార్ అయిపోయింది. ఆమె సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య కూడా రెండున్నర లక్షలకు పైగా పెరిగింది. ఇదంతా కేరళ స్టోరీ మహత్యం. అయితే ఇప్పుడే అదా శర్మ మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు క్రిటిక్స్. ఈ క్రేజ్ తో ఆమె నిలకడా మరో 2-3 హిట్స్ ఇవ్వాలని, అప్పుడు మాత్రమే స్టార్ అవుతుందని చెబుతున్నారు. 

అదా మాత్రం ఇవేం పట్టించుకోవట్లేదు. తన 15 ఏళ్ల సినీ అనుభవంతో ఆమె ఒక్కటే చెబుతోంది, భాష ఏదైనా మనసుకు నచ్చిన సినిమాలు చేస్తానంటోంది. కెరీర్ లో ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేస్తానంటోంది. ఏ పనైనా ఇష్టంగా చేస్తే, సక్సెస్ ఆటోమేటిగ్గా వస్తుందనడానికి అదా లైవ్ ఎగ్జాంపుల్.