టాలీవుడ్ లో ఆలోచించాల్సిన టైమ్ వచ్చేసింది

టాలీవుడ్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సినిమా పంపిణీ వ్యవస్థలో మార్పులు వస్తూనే వున్నాయి. ఏదీ ఫిక్స్ డ్ గా వుండిపోలేదు.  ఎప్పటికప్పుడు మారుతూనే వస్తున్నాయి. సినిమా నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు కానీ, ఫైనాన్స్…

టాలీవుడ్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సినిమా పంపిణీ వ్యవస్థలో మార్పులు వస్తూనే వున్నాయి. ఏదీ ఫిక్స్ డ్ గా వుండిపోలేదు.  ఎప్పటికప్పుడు మారుతూనే వస్తున్నాయి. సినిమా నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు కానీ, ఫైనాన్స్ డీలింగ్స్ కానీ, పంపిణీ విషయాలు కానీ ఎప్పటికప్పుడు లూప్ హొల్స్ సవరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 

టాలీవుడ్ లో వున్న ప్రత్యేకత ఏమిటంటే రాత..సంతకం..అగ్రిమెంట్..లీగాలిటీ ఇలాంటి వాటి కన్నా నోటి మాటకు ఎక్కువ విలువ అన్నది. చిరకాలంగా ఇదే జరుగుతూ వస్తోంది. అందుకే టాలీవుడ్ లో చాలా వరకు ఆరోగ్యకరమైన సంబంధాలు వుంటూ వస్తున్నాయి. పైగా ఈ వ్యాపారం సగం బ్లాక్, సగం వైట్ అనే పద్దతిలో ఇన్నాళ్లూ సాగుతూ వస్తోంది కనుక ఈ నోటి మాట అన్నదే కీలకంగా మారింది.

కానీ ఇప్పుడు ప్రభుత్వాల పద్దతులు మారాయి. జి ఎస్ టీ వచ్చింది. వైట్ పోర్షన్ బాగా పెరిగింది. బ్లాక్ అన్నది చాలా నామినల్ అయిపోయింది. ఇది ఒక అంశం. దీన్ని అలా వుంచితే సినిమా వ్యాపారంలో భారీ రిస్క్ అన్నది బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు కాస్త మినిమమ్ గ్యారంటీ అనేది వుండేది. సిన్మా ఫ్లాప్ అయినా చాలా వరకు రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువ వుండేవి. కానీ కరోనా తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. థియేటర్ ఆదాయాన్ని నమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది.

జనం నచ్చితే ఎంతయినా ఇస్తున్నారు. నచ్చకుంటే రూపాయి కూడా ఇవ్వడం లేదు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో హిట్ లేదా డిజాస్టర్ రెండే మిగిలాయి. యావరేజ్ సినిమాలు మాయం అయ్యాయి. మార్నింగ్ షో తోనే సినిమా ఫేట్ ఫిక్స్ అయిపోతోంది. తరువాత ఎంత ఎత్తుదామన్నా జనం అస్సలు పట్టించుకోవడం లేదు. కాస్త బాగుందనే లాంటి టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్ తో ఖతమ్ అయిపోతోంది. 

సినిమా బాగుంది అంటే మాత్రం, చిన్న సినిమానా? పెద్ద సినిమానా? డబ్బింగ్ సినిమానా? అన్నది చూడడం లేదు. కాసులు కురిపిస్తున్నారు. బాగాలేకపోతే మాత్రం చాలా అంటే చాలా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి వల్ల సినిమా పంపిణీ దారుల పరిస్థితి చిక్కుల్లో పడింది.

తెలుగు సినిమా వ్యాపారం బ్లయిండ్ ఫోల్డ్. సినిమాను చూడకుండా, కాంబినేషన్ ను నమ్ముకుని పోటీలు పడి సినిమాలు కొంటున్నారు. ప్రపంచం మొత్తం మీద సరుకు చూడకుండా పోటీ పడి కొనుగోలు చేసేది ఒక్క సినిమా మాత్రమే అనుకోవాలేమో? ఇలా చేయడం ఒకప్పుడు లేదు. టాలీవుడ్ ఆరంభంలో చాలా వరకు సింగిల్ పంపిణీ సిస్టమ్ వుండేది. ఫైనాన్స్..డిస్ట్రిబ్యూషన్ కలిసే వుండేవి. కథ వినడం దగ్గర నుంచి కీలకంగా వ్యవహరించేవారు.

ఆ తరువాత ఫైనాన్స్ సిస్టమ్ సెపరేట్ అయింది. అప్పుడు కూడా పద్దతిగానే వుండేది. ఫైనాన్స్ ఇచ్చేవారు, ఎప్పటికప్పుడు ఫుటేజ్ డెవలప్ చేసి, చూసి, సరిగ్గా వస్తోందో లేదో గమనించి, అప్పుడు తరువాత విడత ఫైనాన్స్ అందించేవారు. కానీ రాను రాను ఇదంతా మారిపోయింది.

ఇప్పుడు కంపెనీల మీద నమ్మకం పెరిగిపోయింది. ప్రాజెక్ట్ ఫైనాన్స్ కాస్తా కంటిన్యూ ఫైనాన్స్ గా మారుతోంది. సినిమా మీద నుంచి సినిమా మీదకు ఫైనాన్స్ షిఫ్ట్ అవుతోంది. అడ్వాన్స్ లు కూడా ఫైనాన్స్ తో ఇస్తున్నారు. ఓ సూపర్ స్టార్ సినిమాకు ఓ సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ ఇచ్చిన అడ్వాన్స్ , సినిమా తీసే వేళకు పది కోట్లకు చేరుకుంది. ఈ జనరేషన్ లో ఓ యంగ్ డైరక్టర్ కు ఇచ్చిన మూడు కోట్ల అడ్వాన్స్ మూడు సార్లు తిరగరాసేసరికి 12 కోట్లకు చేరుకుంది. మరో పెద్ద నిర్మాణ సంస్థ ఓ బడా స్టార్ కు ఇచ్చిన అడ్వాన్స్, ఇప్పటి వరకు చేసిన ఖర్చు వడ్డీలతో కలిపి 40 కోట్లకు పైగా చేరుకుందని తెలుస్తోంది.

నిర్మాతలు ఇలా జూదం ఆడే పరిస్థితి. డిస్ట్రిబ్యూటర్లు కూడా అదే దారిలో వెళ్తున్నారు. నిర్మాతలతో బంధాలను నమ్ముకుని బ్లయిండ్ గా అడిగినంతా ఇచ్చి సినిమాలు కొంటున్నారు. ఆ క్రేజీ కాంబినేషన్లు చూపించి థియేటర్లకు దగ్గర అడ్వాన్స్ లు లాగేస్తున్నారు. ఇక్కడ రెండు పాయింట్లు వున్నాయి. థియేటర్ల నుంచి వచ్చేది అడ్వాన్స్. చాలా కొన్ని చోట్ల మాత్రమే మినిమమ్ గ్యారంటీలు, అవుట్ రేట్ పర్చేజ్ లాంటివి వుంటాయి. అడ్వాన్స్ అంటే గ్యారంటీ వుంటుంది. డిస్ట్రిబ్యూటర్ వెనక్కు ఇచ్చుకోవాలి. ఎగ్జిబిటర్లకు..నిర్మాతకు ఏ విధమైన సంబంధం వుండదు. కమిట్ మెంట్ వుండదు. పంపిణీదారుకు-నిర్మాతకు మాత్రమే బంధం.

అది కూడా వారి మధ్య కుదిరిన ఒప్పందాన్ని బట్టి. అవుట్ రేట్ నా, నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ నా, లేదా కేవలం పంపిణీనా ఇలా. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా తయారయింది అంటే సినిమా డిజాస్టర్ అయితే నిర్మాత మీదకు వచ్చేస్తోంది. అస్సలు సంబంధం లేని ఎగ్జిబిటర్లు కూడా నిర్మాతలను డబ్బులు వెనక్కు అడుగుతున్నారు. నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ మీద సినిమా చేసిన పంపిణీ దారులు కూడా ఎగ్జిబిటర్లు తమ మీదకు వస్తే, వాళ్లను తీసుకుని నిర్మాతల మీదకు వస్తున్నారు. నిర్మాతలు ఎంతో కొంత వెనక్కు ఇవ్వాల్సి వస్తోంది.

సినిమాలు ఎంత దారుణంగా ఫెయిల్ అవుతున్నాయంటే, ఉత్తరాంధ్రలో ఓ మంచి పంపిణీదారు గా వున్న గాయత్రీ సతీష్ కేవలం ఒక్క సినిమా, ఏజెంట్ కారణంగా జీవిత కాలం లాభాలు పోగొట్టుకున్నారు. దాదాపు పాతిక కోట్ల మేరకు ఊబిలోకి దిగిపోయారు. దిల్ రాజు లాంటి బడా పంపిణీ దారు గత నెలరోజుల్లో దాదాపు 30 నుంచి నలభై కోట్లు నష్టపోయారు.

ఇక ఇప్పుడు టైమ్ వచ్చింది. పంపిణీ సిస్టమ్ నే మార్చాల్సి వుంది. హిందీ, కన్నడ బడా బ్యానర్ల మాదిరిగా తక్కువ కమిషన్ కు కేవలం రిస్క్ లేని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రావాల్సి వుంది. అప్పుడే నిర్మాతల మీద భారం అంతా పడుతుంది. నిర్మాతలు కాంబినేషన్లు కాకుండా కథలను నమ్ముకుంటారు. క్వాలిటీ చెక్ చేసుకుంటారు. సరైన సినిమాలు వస్తాయి. లేదూ అలా సాధ్యం కాదు అనుకుంటే కేవలం నాన్ థియేటర్ ఆదాయంలోనే సినిమా మొత్తం పూర్తి చేసుకుని థియేటర్ ను లాటరీకి వదిలేస్తారు.

అసలు నాన్ థియేటర్ ఆదాయం పెరిగింది అనే వంక చూపించి హీరోలు దారణంగా లాగేస్తున్నారు. కానీ వాస్తవానికి శాటిలైట్ ఆదాయం పడిపోయింది. థియేటర్ ఆదాయం పడిపోయింది. దీన్ని మాత్రం హీరోలు పట్టించుకోవడం లేదు. కేవలం ఓటిటి, హిందీ మార్కెట్ చూపించి రెమ్యూనిరేషన్లు లాగేస్తున్నారు. గోపీచంద్ లాంటి హిట్ లు లేని హీరోలు కూడా ఏడు కోట్లు తీసుకుంటున్నారని వార్తలు వున్నాయి. దీనికి తప్పు నిర్మాతలదే. ఏదో ఒక సినిమా తీసేయాలనే తాపత్రయంతో ఎగబడుతున్నారు.

మొత్తం టాలీవుడ్ సిస్టమ్ ప్రక్షాళన కావాల్సిన టైమ్ వచ్చింది.