వరుసగా 4 ఫ్లాప్స్.. ఆమె పనైపోయినట్టేనా ఇక?

సెంటిమెంట్స్ మీద నడిచే ఇండస్ట్రీ మనది. ఏమాత్రం నెగెటివ్ సెంటిమెంట్ కొట్టినా, ఒక్క పాజిటివ్ అంశం కూడా ఆలోచించరు. హీరోయిన్ల విషయంలో ఈ సెంటిమెంట్ మరీ ఎక్కువ. హిట్ ఇస్తున్న హీరోయిన్ వెంట ఇండస్ట్రీ…

సెంటిమెంట్స్ మీద నడిచే ఇండస్ట్రీ మనది. ఏమాత్రం నెగెటివ్ సెంటిమెంట్ కొట్టినా, ఒక్క పాజిటివ్ అంశం కూడా ఆలోచించరు. హీరోయిన్ల విషయంలో ఈ సెంటిమెంట్ మరీ ఎక్కువ. హిట్ ఇస్తున్న హీరోయిన్ వెంట ఇండస్ట్రీ పరుగులు పెడుతుంది. కాల్షీట్ల కోసం ఎగబడుతుంది. ఫ్లాప్ ఇస్తే మాత్రం కనీసం ఆమె వైపు తిరిగి చూడదు.

ఇప్పుడీ ప్రమాదాన్నే ఎదుర్కోబోతోంది హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెనతో అమాంతం క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. శ్యామ్ సింగరాయ్ తో ఓకే అనిపించుకుంది, బంగార్రాజుతో మరో సక్సెస్ కొట్టింది. అంతే.. బంగార్రాజు సినిమానే ఆమె చివరి విజయం.

రీసెంట్ గా కృతి చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. వారియర్ నుంచి మొదలుపెడితే.. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలన్నీ డిజాస్టర్లు అయ్యాయి. ఇక తాజాగా వచ్చిన కస్టడీది కూడా అదే పరిస్థితి.

నాగచైతన్య-కృతిశెట్టి కలిసి చేసిన సినిమా ఇది. ఈ మూవీతో బంగార్రాజు మేజిక్ రిపీట్ అవుతుందని భావించింది కృతి. కానీ ఆమె కోరుకున్నది జరగలేదు. కస్టడీ ఫ్లాప్ అయింది. కృతి కెరీర్ లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది.

ఈ సినిమాతో వరుసగా 4 ఫ్లాపులిచ్చినట్టయింది కృతి. దీంతో ఆమె కెరీర్ పై ఆ ప్రభావం గట్టిగా పడబోతోంది. ఇప్పటికే ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి.