ఆదిపురుష్ వివాదం.. అక్కడ ప్రసారాలు బంద్

ఊహించని విధంగా ఆదిపురుష్ సినిమా నేపాల్ లో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సీతను భారతీయ పుత్రికగా సినిమాలో పేర్కొనడాన్ని నేపాల్ రాజధాని ఖాట్మాండూ మేయర్ బాలేంద్రషా తీవ్రంగా వ్యతిరేకించారు. Advertisement జానకిని నేపాల్ కు…

ఊహించని విధంగా ఆదిపురుష్ సినిమా నేపాల్ లో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సీతను భారతీయ పుత్రికగా సినిమాలో పేర్కొనడాన్ని నేపాల్ రాజధాని ఖాట్మాండూ మేయర్ బాలేంద్రషా తీవ్రంగా వ్యతిరేకించారు.

జానకిని నేపాల్ కు చెందిన స్త్రీగా చూస్తారు నేపాలీయులు. నేపాల్ లోని జనక్ పూర్ ఆమె నివాసమని, ఆమె తండ్రి పేరు జనకుడని, అందుకే సీతకు జానకి అనే పేరు కూడా వచ్చిందని అంటారు. కాబట్టి జానకిని భారతీయ పుత్రికగా పేర్కొనడాన్ని సినిమా నుంచి తొలిగించాలని మేయర్ డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ కు ఆదిపురుష్ మేకర్స్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. కాకపోతే ఖాట్మాండూ మేయర్ ఇచ్చిన గడువులోగా ఈ మార్పు జరగలేదు. దీంతో ఖాట్మాండూ మెట్రోపాలిటన్ పరిథిలో ఆదిపురుష్ సినిమా ప్రసారాల్ని నిలిపేయాలని మేయర్ ఆదేశించారు. కేవలం ఆదిపురుష్ ను మాత్రమే కాదు, భారతీయ చిత్రాలన్నింటినీ నిలిపివేసేలా ఆయన ఆదేశాలిచ్చారు.

ఈ ఆదేశాలు వెలువడిన కొద్దిసేపటికే నేపాల్ లోని ఫోఖరా మేయర్ ధనరాజ్ ఆచార్య కూడా స్పందించారు. తమ ప్రాంతంలో కూడా భారతీయ చిత్రాల ప్రసారాల్ని నిలిపివేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు థియేటర్ యజమానులకు ఆయన లేఖలు పంపించారు.

తాజా ఆదేశాలతో ఈరోజు ఉదయం నుంచి నేపాల్ లోని ఈ రెండు కీలక ప్రాంతాల్లో ఆదిపురుష్ ప్రసారాలు నిలిచిపోయాయి. ఖాట్మాండూలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచే ఆదిపురుష్ ప్రసారాల్ని నిలిపేశారు. వాటి స్థానంలో స్థానిక నేపాలీ సినిమాలు, హాలీవుడ్ సినిమాల్ని ప్రసారం చేస్తున్నారు.