అయోధ్య రామాలయానికి ‘ఆదిపురుష్’ భూరివిరాళం!

ఆదిపురుష్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్రపంచంలోనే అతిగొప్ప హిందూ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో చిత్ర యూనిట్ ఇవాళ (6వతేదీ) నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా అనేక సంచలనాలను నమోదు చేయడానికి…

ఆదిపురుష్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్రపంచంలోనే అతిగొప్ప హిందూ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో చిత్ర యూనిట్ ఇవాళ (6వతేదీ) నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా అనేక సంచలనాలను నమోదు చేయడానికి సినిమా యూనిట్ ఉత్సాహపడుతోంది. 

భారీ స్థాయిలో రామాయణం సహా, ఇతర హిందూపురాణ గాథల ప్రదర్శనలను ఏర్పాటుచేశారు. ఆదిపురుషుడు రాముడిగా ప్రభాస్ హాలోగ్రామ్ కటౌట్ ను యాభై అడుగుల ఎత్తుతో అత్యంత భారీగా ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే ఆదిపురుష్ మేకర్స్ ద్వారా అత్యంత విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అయోధ్య రామాలయ నిర్మాణానికి కనీ వినీ ఎరుగనంత భూరి విరాళాన్ని.. ఇవాళ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికమీదినుంచి ప్రకటించే అవకాశం ఉన్నదని తెలుస్తోంది.

ఆదిపురుష్ చిత్రాన్ని రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. స్క్రీన్ ప్లే లో కొన్ని చిన్న చిన్న చమక్కులను ఈ సినిమా క్రియేటివ్ టీమ్ వండుకోవాల్సిందే తప్ప.. బేసిగ్గా.. కథ- స్క్రీన్ ప్లే మొత్తం రామాయణం నుంచి తీసుకున్నవే. 

సాధారణంగా ఈస్థాయి అగ్రహీరోల పాన్ ఇండియా మూవీలను వందల కోట్ల బడ్జెట్ తో చేస్తున్నప్పుడు.. కథ- స్క్రీన్ ప్లే ల కోసమే కనీసం పది నుంచి యాభైకోట్ల దాకా ఖర్చు పెడుతుంటారు కూడా. అంత విలువ మేరకు రాముడి కథను తాము దొంగిలించి క్యాష్ చేసుకున్నట్టుగా దేవుడికి ఆగ్రహం కలగకుండా ఉండడానికి, కథ స్క్రీన్ ప్లేలకు కాగల  ఆ రెమ్యునరేషన్ మొత్తాన్ని ఒక అంచనాతో అయోధ్య రామాలయ నిర్మాణానికి ఇవ్వాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. కనీసం పదినుంచి యాభైకోట్ల వరకు ఎంతైనా విరాళం ప్రకటించే అవకాశం ఉన్నదని విశ్వసనీయ సమాచారం.

ఆదిపురుష్ మేకర్స్ హిందూ ధార్మిక విశ్వాసాలకు, సెంటిమెంటుకు తొలినుంచి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ కూడా ఆ కేటగిరీక చెందిన వ్యక్తే. రాముడి లాగానే హనుమంతుడి పట్ల కూడా తమ భక్తి ప్రపత్తులను ఆదిపురుష్ టీమ్ చాలా ఘనంగా చాటుకుంటోంది. 

‘‘రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటకి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకానికి గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. అతి గొప్ప రామభక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన 'ఆదిపురుష్' ని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం’’ అంటూ మేకర్స్ ఓ పోస్టు పెట్టారు కూడా.

హనుమంతుడి పట్ల అంతటి భక్తితో ప్రతి థియేటర్లో ఒక టికెట్ కు రాగల సొమ్మును త్యాగం చేస్తున్న మేకర్స్.. రాముడి కథను అప్పనంగా రూపాయి ఖర్చు లేకుండా దొంగిలించి.. దేవుడి పట్ల ఆ రుణభారం మిగిలిపోయే దాచుకుంటారని అనుకోవడం భ్రమ. అందుకే.. అయోధ్య రామాలయ నిర్మాణానికి కనీసం పదికోట్ల రూపాయల విరాళం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.

రామాయణ కథను ఉచితంగా తీసుకున్నందుకు ముడుపు చెల్లించుకునే విషయంలో రకరకాల ఆలోచనలు చేసినప్పటికీ.. రామాలయానికి ఇవ్వడమే కరెక్టు అని నిర్ణయించారట. అయోధ్య ఆలయంకోసం ఇచ్చినట్లయితే పాన్ ఇండియా చిత్రం ప్రమోషన్స్ కు కూడా ప్లస్ అవుతుందని తలపోశారట. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి, ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో ప్రభాస్ ద్వారా ప్రకటింపజేసి సంచలనం సృష్టించాలని మేకర్స్ ప్లాన్.

సినిమా సంగతి ఎలా ఉన్నప్పటికీ.. రామాయణ కథను ఖర్చులేకుండా తీసుకుని.. వందల కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దిన మేకర్స్.. ఇలాంటి ఆలోచన చేయడం బహుధా అభినందనీయం.