సీట్లు అడిగే ముందు పవన్ గమనించాల్సిన అంశాలివే!

ఈ నెల 14వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ చాలా బిజీ అయిపోతారు. వారాహి యాత్ర ఆరోజున ప్రారంభం అవుతుంది. నిలకడగా కూర్చుని వ్యూహరచన చేయడానికి, మేధోమధనం చేయడానికి ఆ తర్వాత సమయం తక్కువగా…

ఈ నెల 14వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ చాలా బిజీ అయిపోతారు. వారాహి యాత్ర ఆరోజున ప్రారంభం అవుతుంది. నిలకడగా కూర్చుని వ్యూహరచన చేయడానికి, మేధోమధనం చేయడానికి ఆ తర్వాత సమయం తక్కువగా ఉంటుంది. అందుకే ఆయన పొత్తుల విషయంలో ఎన్ని సీట్లు, ఏయే సీట్లు అడగాలనే దానిపై ఇప్పుడే కసరత్తు పూర్తి చేస్తున్నారు. 

తన పార్టీ తరఫున సర్వేలు చేసిన సంస్థలతో భేటీ అవుతున్నారు. పొత్తుల సంగతి పూర్తిగా తనకు వదిలేయమని పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పేశారు కూడా. అయితే.. తెలుగుదేశంతో పొత్తు విషయం డిసైడ్ అయిన పవన్ కల్యాణ్ ఎన్నిఏయే సీట్లు అడగాలో డిసైడ్ చేసుకునే ముందు ఆయన పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.

అవేమిటో గమనిద్దాం..

=) 2019 ఎన్నికల్లో బిఎస్పీతో పొత్తు పెట్టుకున్న జనసేన రాష్ట్రవ్యాప్తంగా 138 సీట్లలో పోటీచేసింది. కేవలం 16 సీట్లలో మాత్రమే వారికి డిపాజిట్లు లభించాయి.

=) ఒకే ఒక్క సీటు (రాజోలు)లో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలిచారు. ఆయన తర్వాత వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. రాజోలు విజయాన్ని జనసేన పార్టీ ఖాతాలో వేసుకోవడానికి వీల్లేదు. వరప్రసాద్ స్థానికంగా చాలా బలమైన నాయకుడు అనే ఉద్దేశంతోనే జనసేన పిలిచి చేర్చుకుంది. ఆయన గెలిచి, పార్టీ చతికిలపడ్డాక ఆయన బయటకు వెళ్లారు. ఈ దఫా ఆయన వైసీపీ అభ్యర్థి అయినా, కాకపోయినా జనసేనకు ఆ సీటు క్లిష్టంగానే ఉంటుంది.

=) రెండుచోట్ల పోటీచేసిన పవన్ కల్యాణ్ రెండూ ఓడిపోయారు. భీమవరంలో సెకండ్ ప్లేస్, గాజువాకలో మూడోప్లేస్ లభించాయి.

=) ఈసారి మళ్లీ తాను రెండు చోట్ల పోటీచేస్తానని పవన్ అడిగితే చంద్రబాబు ఒప్పుకోకపోవచ్చు. పైగా అది పవన్ కు కూడా పరువునష్టంగా ఉంటుంది. తన గెలుపుమీద కూడా నమ్మకం లేని నాయకుడిగా ఆయన విమర్శలు భరించాలి.

=) డిపాజిట్లు సాధించిన మిగిలిన 13 మందిలో ఒక్కరు మాత్రం కృష్ణా జిల్లా కాగా, మిగిలిన డజను మంది ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారే. 

ఈ పాయింట్లను పవన్ కల్యాణ్ మదిలో ఉంచుకోవాలి. అప్పటికీ ఇప్పటికీ తమ పార్టీ బలం చాలా పెరిగిందని ఆయన పైకి ఎన్ని మాటలైనా చెప్పవచ్చు. కానీ.. తాము సొంతంగా చేయించుకున్న సర్వేల్లో ఏ పొత్తులూ లేకపోయినా.. జనసేన గెలవగలదని ఎన్ని సీట్లను సర్వే సంస్థలు సజెస్ట్ చేస్తున్నాయో.. అన్ని సీట్లను మాత్రమే పవన్ కల్యాణ్ అడిగితీసుకుంటే ఆ కూటమికి మేలు జరుగుతుంది. 

పరువు కోసం పోయి.. తెదేపా బలమున్న సీట్లను కూడా లాక్కుని, తమకు సంఖ్యాపరంగా ఎక్కువ సీట్లు కావాలని డాంబికాలకు పోతే.. మొత్తంగా మొదటికే మోసం వస్తుంది. కూటమి బ్యాలెట్ బాక్సు వద్ద కుప్పకూలుతుంది.