మలయాళీ సూపర్ హిట్ సినిమా అయ్యప్పన్ కోషియుం వివిధ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రీమేక్ కు సంబంధించిన అప్ డేట్స్ దాదాపు ఏడాది నుంచి వస్తూనే ఉన్నాయి.
తెలుగులో పవన్ కల్యాణ్- రానా ల కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాను తమిళంలో కూడా రీమేక్ ప్రతిపాదన ఉంది. అయితే కేరళ వెర్షన్ సౌత్ లో బాగా వీక్షణలు పొందింది. అమెజాన్లో ఈ సినిమా రికార్డు స్థాయి వ్యూస్ ను పొందింది. తెలుగు వాళ్లు, తమిళులు, కన్నడీగులు ఏకే ను ఎగబడి చూశారు స్మార్ట్ ఫోన్స్ లో. భాష అతీతంగా మారింది ఈ సినిమాకు. అందుకే కాబోలు తమిళ రీమేక్ ఆ తర్వాత పెద్దగా ఊసు లో లేదు.
మొదట్లో శరత్ కుమార్ – శశికుమార్ అంటూ వార్తలు వచ్చినా, ఆ తర్వాత కార్తీ- పార్తిబన్ లు తెరపైకి వచ్చారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ రీమేక్ ఊసులో లేదు. దాదాపు ఏడాది నుంచి అప్ డేటే లేదు ఈ వ్యవహారంలో!
రీమేక్ రైట్స్ అయితే ఒక సంస్థ కొనుగోలు చేసిందనే వార్తలు వచ్చాయి కానీ, ఇన్నాళ్ల పాటు ఆ సినిమాలో ఎవరు నటిస్తారనే క్లారిటీ కూడా రాకపోవడం ఏకే రీమేక్ పట్ల అక్కడ నటులకు పెద్దగా ఆసక్తి లేదేమో అనుకోవాల్సి వస్తోంది. హిట్లకు మొహం వాచిన శరత్ కుమార్ లాంటి వాళ్లకు తగిన సబ్జెక్టే ఇది. ఒక దశలో కార్తీ-సూర్య అంటూ క్రేజ్ ను జనరేట్ చేసే ప్రయత్నాలూ జరిగాయి. అయితే.. ఏకే రీమేక్ అక్కడ కదల్లేదు, మెదల్లేదు.
ఇక ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను నటుడు జాన్ అబ్రహం కోనుగోలు చేశాడు. తను ఒక పాత్రలో నటించే ఉద్దేశంతో జాన్ ఈ సినిమాను ఎంచుకున్నట్టుగా ఉన్నాడు. రెండో పాత్రకు అభిషేక్ బచ్చన్ ను ఎంచుకున్నాడు. అధికారిక ప్రకటనలు కూడా చేశారు. అయితే ఇప్పుడు అభిషేక్ ఆ సినిమా నుంచి వైదొలిగాడట. ఈ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించేశారు.
ఏకే రీమేక్ నుంచి అభిషేక్ బయటకు రావడంతో.. మరొకరిని ఆ పాత్రకు ఎంచుకోవాల్సిన పరిస్థితుల్లో పడ్డాడట జాన్ అబ్రహాం.