శ్రీవారి భక్తుల కోసం ప్రయోగాత్మకంగా తలపెట్టిన సంప్రదాయ భోజనం విధానం నిలిచిపోయింది. సంప్రదాయ భోజనాన్ని తక్షణం ఆపేస్తున్నట్టు టీడీపీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. పాలక మండలి అమల్లో లేనప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారని.. కొండపై అన్నప్రసాదాన్ని ఉచితంగానే అందించాలి తప్ప, డబ్బులు తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదని సుబ్బారెడ్డి అన్నారు. సంప్రదాయ భోజనంలో భాగంగా రుచికరమైన, పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నప్పటికీ.. డబ్బులు తీసుకోవడం సరైంది కాదన్నారు.
గురువారం నుంచి అన్నమయ్య భవనంలో సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అందిస్తున్నారు. ఇందులో భాగంగా కొబ్బరి అన్నం, పులిహోర, బూరెలు, పచ్చిపులుసు, కాలా బాత్ ఉప్మా, బియ్యం ఇడ్లీ, ఎరుపు రంగు బియ్యంతో చేసిన వంటకాలు, కర్రలు-సామలు లాంటి తృణధాన్యాలతో చేసిన వంటకాల్ని భక్తులకు వడ్డిస్తూ వచ్చారు. అయితే ఇది ఉచితం కాదు. అలాఅని లాభాపేక్షతో చేసిన కార్యక్రమం కూడా కాదు.
పలమనేరులో 450 ఎకరాల్లో టీటీడీకి గోశాల ఉంది. అక్కడున్న సువిశాల క్షేత్రంలో సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. అలా గోవుల ఆధారంగా సేంద్రీయంగా పండించిన ఆహార పదార్థాలతో ఈ సంప్రదాయ భోజనాన్ని సిద్ధం చేస్తున్నారు. కొనుగోలు ధరకే భక్తులకు అందజేస్తున్నారు. అంటే జీరో ప్రాఫిట్-జీరో లాస్ అన్నమాట.
కాన్సెప్ట్ మంచిదే అయినప్పటికీ.. కొండపై స్వయంగా టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఓ కార్యక్రమానికి డబ్బులు వసూలు చేయడంపై చాలామంది అభ్యంతరం వ్యక్తంచేశారు. అవసరమైతే నష్టాన్ని భరించి భక్తులకు సంప్రదాయ భోజనాన్ని పెట్టాలని, అంతేతప్ప ఇలా డబ్బులు వసూలు చేయడం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ నడిచింది.
దీంతో మరోసారి పగ్గాలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి.. సంప్రదాయ భోజనంపై సమీక్ష నిర్వహించారు. తక్షణం నిలిపేయాలని ఆదేశించారు. నిజానికి ప్రయోగాత్మకంగా సెప్టెంబర్ 8 వరకు ఈ భోజనాన్ని అందుబాటులో ఉంచాలనుకున్నారు. కానీ సుబ్బారెడ్డి ఆదేశాలతో నిన్న రాత్రి నుంచే సంప్రదాయ భోజనం ఆగిపోయింది.
అటు భక్తుల కోసం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉచిత నిత్యాన్నదాన కార్యక్రమం మాత్రం యాథావిథిగా కొనసాగుతుంది. అందులో ఎలాంటి మార్పుచేర్పులు లేవని పాలక మండలి స్పష్టంచేసింది.