ఆలస్యంగానైనా కేసీఆర్ ప్రభుత్వం మేల్కొంది. తెలంగాణ ప్రజలకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ, భవిష్యత్‌లో థర్డ్ వేవ్ పంజా విసురుతుందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం.
ఇదే ఏపీ సర్కార్ కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చి వైద్యం అందించిన సంగతి తెలిసిందే. ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా కోవిడ్‌ను ఆరోద్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించడానికి ఇబ్బంది ఏంటని ఆ రాష్ట్ర ప్రతిపక్షాలు నిలదీసిన సంగతి తెలిసిందే. కరోనా ఫస్ట్, సెకెండ్ వేవ్‌లలో సరైన వైద్యం అందక, లక్షలాది రూపాయలు చెల్లించి కార్పొరేట్ ఆస్పత్రులలో చేరలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్(ఏబీ) పథకంలో కరోనాకు చికిత్సను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాగా … తాజా గా తెలంగాణలో ఏబీని అమలు చేస్తుండటంతో ఇది సాధ్యమైంది. ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ చేరకపోవడం వల్లే వైద్యం పెనుభారమైందని బీజేపీ నేతలు విమర్శిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇకనుంచి ‘ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్ భారత్’ పేరుతో ఆరోగ్యశ్రీ పథకం అమలు కావడం గమనార్హం.
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలుతో ప్రజలకు ఉచితంగా అందుతున్న ఉచిత చికిత్సల సంఖ్య 1,668కి పెరిగింది. ఇదిలా ఉండగా ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి ఏడాదికి గరిష్ఠంగా రూ.2 లక్షలు వర్తిస్తుంది.
ఆయుష్మాన్ భారత్‌లో అన్ని చికిత్సలకూ రూ.5 లక్షల వరకూ గరిష్ఠ పరిమితి ఉంటుంది. దీంతో పేద రోగులకు ఇది ఎంతో ఉపకరించనుంది. అసలే వైద్యం ఖరీదైన నేపథ్యంలో ‘ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్ భారత్’ ఎంతో ఊరటనిస్తుందని చెప్పొచ్చు.