ఆదిపురుష్ సినిమాపై మరో నిరసన తెరపైకొచ్చింది. ఈ సినిమాను వెంటనే నిషేధించాలంటూ, ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు నేరుగా ప్రధానమంత్రికి అసోసియేషన్ లేఖ రాసింది.
“ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆదిపురుష్ సినిమాని ప్రదర్శించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మూవీ స్క్రీన్ ప్లే, డైలాగ్‌లు రాముడు, హనుమంతుని కించపరిచేలా ఉన్నాయి. ఆదిపురుష్ సినిమా హిందువుల మతపరమైన సెంటిమెంట్లను, సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తోంది.”
ఆదిపురుష్ లోని రాముడు, రావణుడి పాత్రల్ని వీడియో గేమ్ గా చిత్రీకరించారని అసోసియేషన్ ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడిని బాధించే విధంగా సినిమా ఉందని, తక్షణం ఈ సినిమా ప్రసారాల్ని ఆపేయమని ప్రధాని మోడీని డిమాండ్ చేసింది.
దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ముంతాషిర్ పై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని డిమాండ్ చేసిన ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్, భవిష్యత్తులో ఓటీటీలోకి కూడా ఈ సినిమా రాకుండా చర్యలు చేపట్టాలని ప్రధానిని కోరింది.
అటు నేపాల్ లో కూడా ఈ సినిమాపై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జానకి పాత్రను భారత పుత్రిక అని సంభోదించడాన్ని ఖాట్మాండూ, పోఖారా నగరాల మేయర్లు నిరశించారు. తమ ప్రాంతాల్లో అన్ని భారతీయ సినిమాల ప్రసారాల్ని నిలిపేశారు. దీనిపై ఆదిపురుష్ టీమ్.. నేపాల్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. త్వరలోనే అభ్యంతరకర సన్నివేశాన్ని మార్చేస్తామని హామీ ఇచ్చింది.
ఇటు వారణాసిలో కొంతమంది వ్యక్తులు ఆదిపురుష్ ప్రసారాలు నిలిపేయాలంటూ నిరసన ప్రదర్శన చేశారు. పోస్టర్లు చించేశారు. హిందూ మహాసభ అనే సంస్థ, ఈ మేరకు లక్నో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు సమాజ్ వాదీపార్టీ ఈ సినిమాపై దుమ్మెత్తిపోస్తోంది. ఎజెండాలో భాగంగానే ఈ సినిమాను తీశారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. దీంతో ఆదిపురుష్ సినిమా రాజకీయ రంగు పులుముకుంది.