కులం ఊబిలో ప‌వ‌న్‌!

కులానికి మించిన మ‌త్తు మ‌రొక‌టి లేద‌ని పెద్ద‌లు అన్నారు. రాజ‌కీయం అంటే కులాలు, మ‌తాల‌కు అతీతంగా అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన పార్టీ లేదా నాయ‌కులే పాల‌కులు అవుతారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు కులం కంపు కొడుతున్నాయ‌న్న‌ది…

కులానికి మించిన మ‌త్తు మ‌రొక‌టి లేద‌ని పెద్ద‌లు అన్నారు. రాజ‌కీయం అంటే కులాలు, మ‌తాల‌కు అతీతంగా అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన పార్టీ లేదా నాయ‌కులే పాల‌కులు అవుతారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు కులం కంపు కొడుతున్నాయ‌న్న‌ది వాస్త‌వం. కానీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు ఏ రోజూ బ‌హిరంగంగా తాము ప‌లానా కులాల నాయ‌కుల‌మ‌ని చెప్పుకోలేదు.

కానీ ఆ ప‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసి, అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. తాను కాపు కులానికి చెందిన నాయ‌కుడ‌ని ప్ర‌చారం చేసుకోవ‌డం ద్వారా రాజ‌కీయంగా ల‌బ్ధి పొందుతాన‌ని ఆయ‌న భావిస్తూ వుండొచ్చు. ఏపీలో కాపు, దాని అనుబంధ కులాల ఓటు బ్యాంక్ బ‌లంగా వుంది. బీసీల త‌ర్వాత వారిదే ఆధిప‌త్యం. స‌హ‌జంగా పార్టీ అధినేత కులాన్ని బ‌ట్టి, అది త‌మద‌నే ఫీలింగ్ సంబంధిత ప్ర‌జానీకంలో వుంటుంది. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం.

అయితే ఈ వ్య‌వ‌హారాల‌న్నీ చాప‌కింద నీరులా సాగిపోవాలి. మాంసం తింటున్నాం క‌దా అని ఎముక‌లు మెడ‌లో వేసుకున్న చందంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ వైఖ‌రి వుంది. ప‌వ‌న్ వైఖ‌రితో కాపుల‌ను మిగిలిన కులాల వారికి దూరం చేస్తోంది. ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలి వ‌ల్ల మెజార్టీ కాపుల‌ను మిగిలిన కులాలు శ‌త్రువులుగా చూసే ప‌రిస్థితి నెల‌కుంది. ఈ ఆవేద‌న‌తోనే ప‌వ‌న్‌కు కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ పద్మ‌నాభం ఘాటైన లేఖ రాశారు. అంద‌రి ప్రేమ‌ను చూర‌గొనాల‌ని ముద్ర‌గ‌డ హిత‌వు చెప్పారు.

కానీ ప‌వ‌న్ మాత్రం త‌న వైఖ‌రి మార్చుకునేలా క‌నిపించ‌డం లేదు. కాపులు త‌ప్ప‌, త‌న‌కు వేరే ఓటు బ్యాంక్ లేద‌ని ఆయ‌న అనుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కాపుల్లో కేవ‌లం 30 శాతం మాత్ర‌మే త‌న‌కు ఓట్లు వేశార‌ని ప‌దేప‌దే వాపోతున్నారు. అలాగే అభిమానులు కూడా త‌న స‌భ‌ల‌కి వ‌స్తారే త‌ప్ప‌, ఓట్లు వేయ‌ర‌ని నిష్టూర‌మాడ‌డం తెలిసిందే. ఓట్ల ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి, కులమో, ఇంకో కార‌ణంతోనే జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నార‌ని స్వ‌యంగా ఆయ‌నే చెబుతున్నారు.

రాజ‌కీయంగా కూడా ప‌వ‌న్ వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని తెలిస్తే కాపులు సైతం ఆద‌రించ‌ర‌నే వాస్త‌వాన్ని ప‌వ‌న్ గుర్తిస్తే మంచిది. చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోయ‌డానికే జ‌గ‌న్‌ను శ‌త్రువుగా చిత్రీక‌రిస్తూ, త‌మ‌ను చంద్ర‌బాబుకు అమ్మేస్తున్నార‌ని గ్ర‌హించ‌లేని అజ్ఞానంలో కాపులు లేర‌ని ప‌వ‌న్ గ్ర‌హించాల్సిన అవ‌స‌రం వుంది. ఒక‌వైపు కుల‌, మ‌తాల‌కు అతీతంగా రాజ‌కీయం చేయ‌డ‌మే జ‌న‌సేన పార్టీ ల‌క్ష్య‌మ‌ని చెబుతూ, వాటితోనే చెల‌గాటం ఆడ‌డం ప‌వ‌న్‌కు మంచిది కాదు. కేవ‌లం కులాన్ని న‌మ్ముకుంటే ఎప్ప‌టికీ రాజ‌కీయంగా ఎద‌గ‌లేర‌ని క‌ఠిన నిజాన్ని ఆయ‌న ఇప్ప‌టికే గుర్తించాల్సి వుంది.

ప‌దేళ్లుగా అసెంబ్లీలో అడుగు పెట్ట‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌… ఓట‌మి నుంచి గుణ‌పాఠాలు నేర్చుకోకపోతే, ఇక ఆయ‌న ఎప్ప‌టికీ మార‌రు. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌, ఆయ‌న మాట‌ల్ఆడుతున్న తీరు, వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌ల‌ను ప‌రిశీలిస్తే… ప‌వ‌న్ పూర్తిగా కులం ఊభిలో ఇరుక్కుపోయార‌ని అర్థమ‌వుతోంది. ఇక జ‌న్మ‌లో ఆయ‌న్ను మ‌రో కులం ఆద‌రించే ప‌రిస్థితి వుండ‌దు. తాజాగా ముద్ర‌గ‌డ లేఖ‌తో ఇద్ద‌రు కాపు నేత‌ల మ‌ధ్య వివాదంగా జ‌నం చూస్తున్నారు.