హమ్మయ్య.. కౌగిలించుకున్నారు

పుష్ప-2 చుట్టూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. హీరో-దర్శకుడి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ చాలా కథనాలొస్తున్నాయి. హీరో హైదరాబాద్ లో ఉంటే దర్శకుడు అమెరికా వెళ్లిపోయాడని..…

పుష్ప-2 చుట్టూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. హీరో-దర్శకుడి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ చాలా కథనాలొస్తున్నాయి. హీరో హైదరాబాద్ లో ఉంటే దర్శకుడు అమెరికా వెళ్లిపోయాడని.. అతడు తిరిగొస్తే, హీరో అమెరికా వెళ్లిపోతున్నాడని చాలా నడిచాయి.

ఎట్టకేలకు సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటికీ రీసెంట్ గా దర్శకుడు మూడ్ లేదని, ఆరోగ్యం బాగాలేదని ఓసారి స్కిప్ కొట్టినట్టు గాసిప్స్ వచ్చాయి. నిప్పు లేనిదే పొగ రాదు కాబట్టి, ఇందులో అంతోఇంతో వాస్తవం ఉందనేది అందరికీ తెలిసిపోయింది.

ఎట్టకేలకు ఇటు బన్నీ, అటు సుక్కూ కలిసి ఈ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. చాన్నాళ్ల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కలిసి ఒకే వేదికపై కనిపించారు. ఓ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వీళ్లిద్దరూ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

హాల్ లోకి వస్తూనే సుకుమార్ ను కౌగిలించుకున్నాడు బన్నీ. అటు సుక్కూ కూడా అంతే ఆప్యాయంగా రియాక్ట్ అయ్యాడు. అక్కడితో అయిపోలేదు. ఓవైపు ఫంక్షన్ నడుస్తుంటే, పక్కపక్కన కూర్చున్న బన్నీ-సుక్కూ.. ఎన్నో ఏళ్ల తర్వాత కలిసిన పాత స్నేహితుల్లా తెగ మాట్లాడేసుకున్నారు.

వాళ్లు ఏం మాట్లాడుకున్నారనే విషయం పక్కనపెడితే.. ఇద్దర్నీ అలా చూసిన ప్రేక్షకులు, అభిమానులు మాత్రం చాలా సంబరపడ్డారు. అలా బన్నీ-సుక్కూ కలిసి.. తమ మధ్య ఆల్ ఈజ్ వెల్ అని సంయుక్తంగా చేతల ద్వారా తెలిపే ప్రయత్నం చేశారు. ఎప్పట్లానే తామిద్దరం కలిసే ఉన్నామనే సంకేతాన్నిచ్చారు.

ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. వివిధ లొకేషన్లకు తిరక్కుండా, ఫిలింసిటీలోనే సెట్స్ వేసి షూటింగ్ పూర్తిచేయాలని నిర్ణయించారు. అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు.

13 Replies to “హమ్మయ్య.. కౌగిలించుకున్నారు”

Comments are closed.