అల్లు ఫ్యామిలీ నుంచి మరో జనరేషన్ తెలుగు తెరపైకొస్తోంది. బన్నీ కూతురు అల్లు అర్హ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ జరిగిపోయింది. శాకుంతలం సినిమాలో ఓ కీలక పాత్ర కోసం చిన్నారి అల్లు అర్హను తీసుకున్నాడు దర్శకుడు గుణశేఖర్.
అల్లు అర్హ ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చేసింది. అర్హపై 10 రోజుల పాటు షూటింగ్ చేస్తారు. చిన్ననాటి భరతుడి పాత్రలో అర్హ కనిపించబోతోంది. సమంత లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు అర్హ రాకతో మరింత పాపులారిటీ పెరిగింది.
నటీనటుల వారసుల్ని ఇలా తెరపైకి తీసుకురావడం గుణశేఖర్ కు చాలా ఇష్టం. గతంలో ఎన్టీఆర్ ను రామాయాణం చిత్రంతో బాలనటుడిగా పరిచయం చేసిన గుణశేఖర్, ఇప్పుడు అర్హను వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. తన సినిమాలో ఓ స్టార్ కిడ్ నటించబోతోందనే విషయాన్ని ఈమధ్యే చూచాయగా బయటపెట్టాడు గుణశేఖర్. అదిప్పుడు అర్హ రూపంలో నిజమైంది.
మొత్తానికి అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ తర్వాత నాలుగో తరం వారసురాలిగా అర్హ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అన్నయ్య అయాన్ కంటే ముందే వెండితెరపైకొచ్చింది.
నిజానికి అర్హ డెబ్యూ కోసం ప్లాన్ చేసిన సినిమా ఇది కాదు. దిల్ రాజు బ్యానర్ లోనే లిటిల్ సోల్జర్స్ తరహాలో ఓ చిన్న పిల్లల సినిమాను పెద్దగా తీయాలని అనుకున్నారు. ఆ మూవీతో అర్హను టాలీవుడ్ కు పరిచయం చేయాలనేది ప్లాన్. కానీ అంతలోనే గుణశేఖర్ చెప్పిన కథ, అందులో అర్హ పాత్ర నచ్చడంతో చిన్నారి అర్హ డెబ్యూ ఇలా జరిగిపోయింది.