ఒక హీరోపై అభిమానం, మరో హీరోపై దురభిమానంగా మారకూడదు. అలా మారిందంటే విపరీతపోకడలకు దారి తీస్తుంది. అభిమానం తెలకెక్కిన కొందరు సల్మాన్‌ఖాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రముఖ గాయకుడు అమల్ మాలిక్‌ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అది కూడా హద్దులు దాటింది. దీంతో విసుగెత్తిపోయిన సింగర్ అమల్ మాలిక్ తానేం తక్కువ కాదని సోషల్ మీడియాలో సల్మాన్ అభిమానులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.
సింగర్ అమల్ మాలిక్‌కు టాలీవుడ్‌తో పరిచయం ఉంది. తెలుగులో బుట్టబొమ్మ తదితర సూపర్‌హిట్ సాంగ్స్ పాడి టాలీవుడ్ ప్రేక్షకులకు ఇష్టమైన గాయకుడయ్యాడు. ఇటీవల తన అభిమాన బాలీవుడ్ హీరో షారూక్ఖాన్పై అభిమానాన్ని చాటుకున్నాడు. ఇదే ఆయనకిప్పుడు చికాకు తెప్పిస్తోంది. షారూక్ అంటే తనకిష్టమని సింగర్ అమల్ మాలిక్ చెప్పడాన్ని మరో బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్‌ఖాన్ అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. మాలిక్‌పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.
“నీకు భాయ్‌జాన్ అంటే ఇష్టం లేదా, నువ్వు కూడా ఆత్మహత్య చేసుకో, నిన్ను చంపేస్తాం” అంటూ బెదిరింపులు, తిట్ల పురా ణానికి దిగారు. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టు…తనను కూడా అలా చేయమని చెబుతూ సల్మాన్ అభిమానుల ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇవ్వాలని అమల్ గట్టిగా నిర్ణయించుకున్నాడు.
తన ఇన్స్టాగ్రామ్ ద్వారా సల్మాన్ ఫ్యాన్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
“ప్రియమైన దద్దమ్మల్లారా.. మీరు నన్ను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. నేను సల్మాన్ ఖాన్‌కు గౌరవం ఇవ్వడం లేదని మీరు అనుకుంటున్నారు. నేను ఎప్పటి నుంచో ఆయనకు రుణపడి ఉన్నాను. అతనో సూపర్ స్టార్. కానీ నాకు చిన్నప్పటి నుంచి షారూక్ అంటే ఇష్టం. ఆ విషయాన్నే వెల్లడించాను. అందులో తప్పేముందో నాకర్థం కావడం లేదు. నా తప్పేంటో తెలుసుకోవాలనుకుంటున్నా.
ఈ మాత్రం దానికే నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. చంపుతాం, అత్యాచారం చేస్తాం అని బెదిరించే అభిమానులను చూసి ఏ హీరో మాత్రం సంతోష పడతారు. ఇదో సిగ్గుమాలిన పనిగా ప్రతి ఒక్కరూ చూస్తారు” అని అమల్ చెంప పగలగొట్టేలా సుదీర్ఘ లేఖ రాశాడు.