తెలుగులో ఇద్దరూ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా అంటే…. వాటి విషయంలో ప్రధానంగా జరిగే చర్చ.. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత? అనేది! ప్రత్యేకించి గత రెండు దశాబ్దాల్లో మల్టీస్టారర్ సినిమాల సంఖ్యే బాగా తక్కువగా ఉంది. అయితే ఇప్పుడిప్పుడు పరిస్థితి మారుతోంది. అయినా… ఇద్దరు హీరోలు కలిసి నటించినప్పుడు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత, ఎవరికి తక్కువ ప్రాధాన్యత.. అనే చర్చ తప్పడం లేదు!
ఓటీటీలో విడుదలకు రెడీ అయిన 'వీ' సినిమా విషయంలోనూ ఆ చర్చ జరుగుతోంది. ఇది నాని 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై ఆ దిశగా కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'గ్రేట్ ఆంధ్ర'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ విషయంపై స్పష్టతను ఇచ్చాడు.
ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు ఇద్దరికీ సమ ప్రాధాన్యత ఉంటుందని ఆ దర్శకుడు స్పష్టం చేశాడు. ఇద్దరి పాత్రల్లో ఎక్కువతక్కువలు ఉండవని అంటున్నాడు. చాలా బ్యాలెన్స్ తో తను సినిమాను తెరకెక్కించినట్టుగా ఇంద్రగంటి వివరించాడు.
తెలుగులో మల్టీ స్టారర్ సినిమాల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఇతర భాషల ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులోనే ఇప్పటికీ అలాంటి సినిమాలు తక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే మరి కొన్ని మల్టీస్టారర్ ప్రతిపాదనలు క్యూలో ఉన్నాయి.