అమెజాన్ ప్రైమ్ వీడియోస్.. టాలీవుడ్ మేకర్స్ కు ఓ వరం. మరీ ముఖ్యంగా చిన్న సినిమాల నిర్మాతలకు కొండంత అండ. అతి పెద్ద భరోసా. తాము తీసిన సినిమా బాక్సాఫీస్ లో ఆడినా ఆడకపోయినా అమెజాన్ లో డీల్ గ్యారెంటీ అనే నమ్మకం చిన్న నిర్మాతది. హిందీ డబ్బింగ్ తర్వాత స్మాల్ టైమ్ ప్రొడ్యూసర్లంతా గంపెడాశలు పెట్టుకునేది అమెజాన్ పైనే. ఇప్పుడా సంస్థ దెబ్బేసింది. చిన్న సినిమాల్ని టెన్షన్ లోకి నెట్టింది.
ఒకప్పుడు సినిమా ఏదైనా అమెజాన్ ప్రైమ్ లో వచ్చేసేది. దీనికి కారణం రెవెన్యూ షేరింగ్. సినిమాను అమెజాన్ లో పెట్టి నీకింత-నాకింత అనే ఒప్పందంపై థర్డ్ పార్టీ జనాలతో సినిమాలు పెట్టించేసేవారు నిర్మాతలు. సబ్ స్క్రైబర్లు ఎక్కువగా ఉండడంతో డబ్బులు కూడా బాగానే వచ్చేవి. కొన్ని సినిమాలైతే తమ బడ్జెట్ మొత్తాన్ని కేవలం అమెజాన్ నుంచే పొందిన సందర్భాలున్నాయి. అలాంటి అమెజాన్ ఇప్పుడు చిన్న సినిమాలకు చెక్ పెడుతోంది. గడిచిన వారం, పది రోజుల్లో ఏకంగా 20 సినిమాల్ని ఆపేసింది.
అవును.. చిన్న సినిమాలకు అమెజాన్ ఓ పట్టాన అనుమతి ఇవ్వడం లేదు. రీసెంట్ గా తమ నియమ నిబంధనల్ని సడలించిన ఈ సంస్థ, చాలా సినిమాల్ని రిజెక్ట్ చేసింది. దీంతో చిన్న ప్రొడ్యూసర్లంతా లబోదిబోమంటున్నారు. మరో అవకాశం లేక దిక్కులు చూస్తున్నారు.
నిజానికి అమెజాన్ తో పాటు డిస్నీ హాట్ స్టార్, జీ5, ఆహా, నెట్ ఫ్లిక్స్ లాంటి చాలా ఓటీటీ వేదికలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటన్నింటికీ రకరకాల పాలసీలున్నాయి. మరీ ముఖ్యంగా షేరింగ్ పద్ధతి వీటిలో అందుబాటులో లేదు. పైగా చిన్న సినిమాల్ని ఈ సంస్థలు పట్టించుకోవు. ఇలాంటి టైమ్ లో అమెజాన్ కూడా తమ నియమ-నిబంధనల్ని కఠినతరం చేయడం నిర్మాతలకు ఇబ్బందిగా మారింది.
కేవలం అమెజాన్ పై ఆశలు పెట్టుకొని నిర్మించిన సినిమాల పరిస్థితి ఇప్పుడు గాల్లో దీపంగా మారింది. ఆది సాయికుమార్, సప్తగిరి, నవీన్ చంద్ర, షకలక శంకర్, లాంటివారు నటించిన సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో పడక, మరో ఓటీటీకి సెట్ అవ్వక అలా పడున్నాయి. ఈ ఇబ్బందికర పరిస్థితి ఎప్పటికి సెట్ అవుతుందో చూడాలి. సెట్ అవ్వకపోతే మాత్రం టాలీవుడ్ లో చిన్న సినిమాల నిర్మాణాలు తగ్గడం ఖాయం.