బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, ఆమె భార్య కిరణ్ రావు విడిపోయారు. 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ, విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఇద్దరూ సంయుక్త ప్రకటన చేశారు.
“ఈ 15 ఏళ్ల జీవితంలో మేమిద్దరం మధురమైన అనుభూతిని పొందాం. ఎన్నో జ్ఞాపకాలు పదిలపరుచుకున్నాం. నమ్మకం, గౌరవం, ప్రేమతో మా బంధాన్ని నిర్మించుకుంటూ వచ్చాం. ఇప్పుడు మా జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ఇకపై మేం భార్యాభర్తలం కాదు. కానీ మేమిద్దరం పేరెంట్స్ గా, ఓ కుటుంబంగా మాత్రం కలిసి ఉంటాం. కొడుకు ఆజాద్ కోసం మేం తల్లిదండ్రులుగా కలిసే ఉంటాం. అతడ్ని మేమిద్దరం కలిసి పెంచుతాం.”
లగాన్ సినిమా టైమ్ లో అమీర్ ఖాన్, కిరణ్ రావుకు పరిచయమైంది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో 2005 డిసెంబర్ లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2011 డిసెంబర్ లో వాళ్లకు ఆజాద్ రావ్ ఖాన్ పుట్టాడు.
అమీర్ ఖాన్ కు కిరణ్ రావు కంటే ముందే రీనా దత్తాతో వివాహం అయింది. వాళ్లకు జునైద్ ఖాన్ అనే కొడుకు, ఐరా ఖాన్ అనే కూతురు ఉన్నారు. ఆమెకు విడాకులిచ్చి కిరణ్ రావును పెళ్లి చేసుకున్న అమీర్, ఇప్పుడు కిరణ్ రావుతో కూడా వైవాహిక బంధానికి ముగింపు పలికాడు.
విడాకులనేవి జీవితానికి అంతం కాదని, జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఆరంభమని వీళ్లిద్దరూ ప్రకటించుకున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియా నుంచి అమీర్ ఖాన్ తప్పుకున్న సంగతి తెలిసిందే.