భారత్ భూభాగంలోకి చొరబడాలని కుట్ర పన్నిన చైనా ఆగడాలను మన సైనికులు తిప్పికొట్టడాన్ని చూశాం. కానీ చైనాలో పుట్టిన కరోనా వైరస్ అనే మహమ్మారి చొరబాబును యావత్ ప్రపంచం అడ్డుకోలేక పోయింది. దీంతో ఆర్థికంగా దివాళా తీయడంతో పాటు లక్షలాది ప్రాణాలను బలి తీసుకుంటోంది. కరోనా వ్యాప్తిలో ప్రపంచంలో మనదేశంలో మూడో స్థానంలో నిలబడడం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తూ వికటాట్టహానం చేస్తోంది.
కరోనాతో బాలీవుడ్ వణికిపోతోంది. ఒక్కో సెలబ్రిటీ కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారిన పడి ఆస్పత్రి పాలు కావడం బాలీవుడ్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. ఒక వైపు అమితాబ్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతుంటే, మరోవైపు మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబం ఆ మహమ్మారి బారిన పడిందనే చేదు వార్త వెలుగు చూసింది.
ఏకంగా అనుపమ్ ఖేర్ కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్‌లో షేర్ చేసిన వీడియోలో చెప్పడం గమనార్హం. ఆ వీడియోలో ఆయనేం చెప్పారంటే…
“కొన్ని రోజులుగా అమ్మ దులారి అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా కోవిడ్ ఉన్నట్లు తేలింది. అయితే ఆమెలో కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఆమెను ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్పించాం. ఆమెతో పాటు తమ్ముడు(రాజు ఖేర్), మరదలు, మేనకోడలు కూడా కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. నేను కూడా పరీక్ష చేయించుకోగా నెగెటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేము హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాం. సోదరుడి ఇంటిని శానిటైజ్ చేస్తున్నారు” అని అనుపమ్ పేర్కొన్నారు.
ప్రతిరోజూ సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఏదో ఒక కుటుంబం కరోనా బారిన పడుతున్నట్టు వస్తున్న వార్తలు నిద్రలేని రాత్రులను మిగిల్చుతోంది. తెల్లారితే ఎలాంటి అశుభ వార్త వినాల్సి వస్తుందోనని బాలీవుడ్ వణికిపోతోంది.