దాదాపు ఏడాది కిందట ఏర్పడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రివర్గం విషయంలో ఆదిలోనే అంచనాలన్నీ తలకిందుల అయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీని అందించింది, ఆల్మోస్ట్ 95 శాతం సీట్లను కట్టబెట్టింది రాయలసీమ. అయితే మంత్రివర్గంలో మాత్రం రాయలసీమకు ఆ స్థాయి వాటాలేవీ దక్కలేదు.
చిత్తూరు జిల్లాకు రెండు, కర్నూలు జిల్లాకు రెండు చొప్పున మంత్రి పదవులు దక్కాయి కానీ, అనంతపురం- కడప(సీఎం జగన్ కాకుండా) జిల్లాలకు మాత్రం ఒక్కో పదవే దక్కాయి. అనంతపురం జిల్లాలో రెండు సీట్లు మినహా అన్ని సీట్లూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కాయి.
ఇక కర్నూలు జిల్లా అయితే జగన్ పార్టీకి స్వీప్ చేసి పెట్టింది. 14 సీట్లకు గానూ 14 సీట్లలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విజయం వరించింది. దీంతో ఆశావహుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సీనియర్ నేతలు తమకు అవకాశం దక్కుతుందని ఆశించారు. అయితే అందరి ఆశలూ తలకిందుల అయ్యాయి. అయితే కొద్దో గొప్పో నామినేటెడ్ పోస్టుల్లో చిత్తూరు జిల్లా నేతలకు అవకాశం దక్కింది. చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఆర్కే రోజాలకు నామినేటెడ్ పోస్టులు దక్కాయి.
చెవిరెడ్డి రెండు- మూడు నామినేటెడ్ హోదాల్లో ఉండగా, ఏపీఐఐసీ వంటి కీలక సంస్థ చైర్మన్ గా రోజా ఉనికిని చాటుకుంటూ ఉన్నారు. ఎటొచ్చీ కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలకు మాత్రం పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. అనంతపురం జిల్లాకు దక్కిన ఏకైక మంత్రి పదవిని బీసీలకు ఇచ్చారు జగన్. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో కురుబలకు మంత్రి పదవిని ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా రుణపడినట్టుగా కురుబలు ఓట్టేస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు ఆ సామాజికవర్గం వారికి ఎప్పుడూ మంత్రి పదవిని ఇచ్చిన చరిత్ర లేదు. జగన్ ఆ లోటును భర్తీ చేశారు. ఇక అనంతపురం నుంచి మరో నేత ఎవరినీ మంత్రి పదవి విషయంలో పట్టించుకోలేదు.
ప్రత్యేకించి అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిలు మంత్రి పదవుల విషయంలో అక్కడ ఆశావహులుగా ఉన్నారు. పరిటాల కుటుంబానికి చెక్ పెట్టిన ప్రకాష్ రెడ్డికి మంత్రి హోదా అనేది పార్టీ అభిమానులు ఆమోదించే అంశంగా నిలుస్తోంది. రాప్తాడు పరిధిలో పార్టీకి మరింత గట్టిగా పునాది వేయడానికి అయినా ప్రకాష్ రెడ్డి కి మంత్రి పదవి అనే అంచనాలున్నాయి. కానీ ప్రకాష్ రెడ్డికి ఏడాది కాలంలో జగన్ వద్ద ఎన్ని మార్కులు పడ్డాయో ఎవరికీ అంతుబట్టిన అంశం. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఓకే కానీ, పార్టీ క్యాడర్ ను పూర్తిగా సంతృప్తి పరచడం లేదు అనేది ప్రకాష్ రెడ్డిపై ఉన్న ప్రధాన విమర్శ.
ఇక జిల్లా నుంచి దళిత కోటాలో ఆశావహురాలు జొన్నలగడ్డ పద్మావతి. ఈమెను అండర్ డాగ్ గా పరిగణించాలి. తొలిసారి మంత్రి వర్గ ఏర్పాటు సమయంలో అనూహ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు జగన్. ఆ తరహాలో లక్కీ బై ఛాన్స్ కోటాలో పద్మావతికి ఏమైనా మంత్రి పదవి దక్కుతుందేమో చూడాల్సి ఉంది. ఆమె భర్త రెడ్డి కావడంతో..అటు క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు లేకపోలేదు!
అనంతపురం నుంచి ఇంకా మరింత మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వారి పేర్లు మంత్రి పదవుల విషయంలో వినికిడిలో లేనట్టే. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే..అక్కడ కోటా భర్తీ అయినట్టే. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. గుమ్మనూరు జయరాం కూడా అక్కడ నుంచి మంత్రిగా ఉన్నారు.
జిల్లాకు కనీసం రెండు మంత్రి పదవుల లెక్కన చూసుకుంటే కర్నూలులో బ్యాలెన్స్ అయినట్టే. అయితే ఆశావహుల విషయానికి వస్తే.. మొత్తం సీట్లను వైసీపీ స్వీప్ చేయడంతో వారి హడావుడి ఉంది. ఈ జాబితాలో ముందు వరసలో ఉన్నారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి దక్కలేదని బాహాటంగానే కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారాయన. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కర్నూలు జిల్లాకే మరో మంత్రి పదవి దక్కుతుందా? అనేది కొశ్చన్ మార్కే.
ఏతావాతా చిత్తూరు నేతలే హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు మంత్రులు, మరో ఇద్దరికి నామినేటెడ్ పోస్టులు. అక్కడి సీనియర్లలో భూమన కరుణాకర్ రెడ్డి మాత్రమే కేవలం ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు. చిత్తూరు జిల్లాకు కూడా మూడో మంత్రి పదవి సందేహమే అని స్పష్టం అవుతోంది. కడప జిల్లా లో జగన్ తో పాటు మరో మంత్రి పదవి ఉన్నారు. ఆశావహుల విషయానికి వస్తే మేడా మల్లిఖార్జున రెడ్డి పేరును ప్రస్తావించవచ్చు.
ఏతావాతా మంత్రి పదవుల మీద ఇప్పుడు రాయలసీమ నుంచి ఆశలు పెట్టుకున్న వారిలో 'రెడ్డి' నేతలే ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నారు. జగన్ తొలి కేబినెట్ కూర్పులో రెడ్లకు దక్కిన ప్రాధాన్యత కూడా తక్కువే. ఈ నేపథ్యంలో త్వరలోనే రెండు పదవుల భర్తీ ఉన్న నేపథ్యంలో ఆశావహులను ప్రస్తావించవచ్చు.
ఇద్దరు బీసీ నేతలు మంత్రి పదవులకు రాజీనామా చేసినా, అదే బీసీ కోటాలో వారిద్దరూ రాజ్యసభ సభ్యులయ్యారు. వాళ్లు హ్యాపీ. కాబట్టి భర్తీ చేసే పదవుల విషయంలో మళ్లీ కచ్చితంగా బీసీలకే ప్రాధాన్యతను ఇవ్వాలనే అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్లేమీ మంత్రి పదవులను పోగొట్టుకోలేదు. ఢిల్లీకి ప్రమోషన్ పొందారు. కాబట్టి.. ఇప్పుడు జగన్ మంత్రి పదవుల విషయంలో ఇతర సామాజికవర్గాలకు ప్రాధాన్యతను ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే భర్తీ అయ్యే ఆ మంత్రి పదవుల్లో రాయలసీమ ప్రాంత నేతలకు ప్రాధాన్యత అసలు ఉంటుందా? అనేది మాత్రం సందేహమే!